Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సందేహాలు, సమాధానాలు

105

నిరాశ వున్నా నిశ్చలత్వం కలగదు. నిరాశ అనే ప్రక్రియనీ అర్థం చేసుకుంటే, మనసు కనుక అసలు నిరాశలో వున్న అంతరార్థాన్ని గ్రహిస్తే, అప్పుడు అందులోని నిజం తెలుస్తుంది. ఒకటి కావాలని మీరు కోరుకుంటున్నప్పుడు, అది పొందలేకపోతే నిరాశ తప్పకుండా కలుగుతుంది. కోరుకున్నది కారు అవచ్చు, స్త్రీ అవచ్పు, దేవుడవచ్చు, అన్నీ సమానమే, భేదమేమీ లేదు. ఏదయినా ఒకటి కావాలి అని మీరు కోరుకోగానే, అప్పుడే ఆ కోరడంలోనే నిరాశ ఆరంభం అవుతున్నది. నిరాశ అంటే భంగపాటు. మీరు కావాలనుకున్నది మీకు లభిస్తే తృప్తిపడతారు. కావాలనుకున్నది మీకు లభించలేదు కాబట్టే 'దేవుడికి నన్ను సమర్పించుకుంటాను' అని అంటారు. కోరుకున్నది దొరికివుంటే నిస్సందేహంగా సంతృప్తి పడివుండేవారు. అయితే త్వరలోనే ఆ తృప్తి తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ యింకొకటి కావాలనుకోవడంలో మునిగిపోతారు. కాబట్టి తృప్తిచెందడానికి కావలసిన వస్తువును మాటిమాటికీ మార్చేస్తుంటారు. అందువల్ల దీనితోపాటుగా కలిగే ప్రతిఫలమూ, బాధలూ, వేదనలూ, సంతోషాలు తప్పవు.

ఏరకమయిన కోరికయినా సరే తనతో పాటుగా భంగపాటును, నిరాశను మోసుకొస్తుందనీ, ఆశనిరాశలనే ద్వంద్వాల మధ్య సంఘర్షణ దాని ఫలితమనీ మీరు అవగాహన చేసుకుంటే, అందులోని వాస్తవాన్ని మీరు గ్రహిస్తే- 'ఆ స్థితిని నేను ఎట్లా చేరుకుంటాను' అని వూరికే అడగడం కాకుండా, కోరిక వల్లనే బాధ కలుగుతున్నదని మీరు గ్రహించినప్పుడు. ఆ గ్రహింపే కోరిక నోరు మూయిస్తుంది. మనసు గోల చేస్తూ వుంటుందనే, మనసు నిరంతరంగా కదిలిపోతూ వుంటుందనే నిరంతరమైన పోరాటం సాగిస్తూ వుంటుందనే ఎరుక కలిగితే, యిచ్చారహితంగా, స్వచ్చంగా, సరళంగా ఎరుక కలిగితే- అటువంటి ఆ ఎరుక మూలంగానే ఆ గోల అంతా మరోమాట లేకుండా ఆగిపోతుంది. ప్రధానమైన విషయం ఎరుకగా వుండటం. నిరాశను పోగొట్టుకోవడమూ కాదు, నిశ్శబ్దంగా వుండటమూ కాదు. స్వచ్ఛమైన తెలివి లేదా వివేకం అంటే ఎరుకగా వున్న మానసిక స్థితి; ఆ స్థితిలో యిష్టాయిష్టాలు వుండవు, ఆ స్థితిలో మనసు నిశ్శబ్దంగా వుంటుంది. అటువంటి నిశ్చలమైన స్థితిలో 'వుండటం' మాత్రమే వుంటుంది. అప్పుడు ఆ సత్యం, అంటే కాలరహితమైన ఆ అద్భుతమైన సృజనశీలత వునికిలోకి వస్తుంది.

ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, VIII వాల్యూమ్,

బొంబాయి, 10, ఫిబ్రవరి 1954.