పుట:కుమారసంభవము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

కుమారసంభవము

సీ. కరవీరరచితనూపురములఁ జెలువొందఁ గాంచనపుష్పమేఖలలు గట్టి
     పున్నాగమయహారములు వట్టి నవకర్ణికారశోభితకటకములు వెలుఁగఁ
     గేసరరాజీవకేయూరములు దొడి రాజీవకర్ణపూరము లమర్చి
     తిలకాభినుతహేమతిలకంబు లుప్పొంగఁ జంపకమాలికాసమితిఁ దాల్చి
     మధులతాంతమయవిమండనమండితు లైనకన్యకాచయంబు నడుముఁ
     బొలిచె నద్రితనయ పుష్పితజంగమలతలనడిమి కల్పలతయుఁ బోలె.499
వ. ఇ ట్లకాలవసంతలతాంతాపచయకేళీలాలసయై కుత్కీలాత్మజ యాక్షణంబ.500
క. అతిసంభ్రమమునఁ ద్రిజగ, త్పతి నర్చన సేయఁదలచి పరిమళమంద
     స్మితకుసుమమృదులపల్లవ, తతిలో మే లేఱికొని ముదం బొదవుమదిన్.501
సీ. మెలపారు నెలమావితలిరుల నొకకొన్ని రమణీయ మగుచంపకములు వొదివి
     లాలితాశోకపల్లవముల నొకకొన్ని గమనీయ మగుగుర్వకములు వెట్టి
     మాసరంపుటరంటిమోసుల నొకకొన్ని గొమరారుకర్ణికారములు నించి
     తరుణాంబుజాతపత్రంబుల నొకకొన్ని యమరినసరసోత్పలములు సుట్టి
     చెలువ లెల్ల నొండుచిగుళులుఁ బువ్వులుఁ గలయఁ దాల్చి పొల్చి బలసి రాఁగ
     శైలరాజతనయ సనుదెంచె నందనవనము గాఁపువచ్చు వడువవోలె.502
ఉ. ఆలలితాంగి భూషితలతాంతవిభూషణజాలమంత్రహం
     సాలసమందయాన వికచామలకోమలనీరజాస్య బా
     లాలికులాళి నీలకుటిలాలక లోలవిశాలనేత్ర కు
     త్కీలతనూజ వచ్చె మరుదీమముపోలెఁ బినాకిపాలికిన్.503
వ. అంతం బరమేశ్వరుండు తుర్యావస్థితంబు లైనమనఃప్రాణంబులు జాగ్రదస్వస్థా
     వ్యవస్థితంబులు చేసి సుప్రసన్నుండైన కన్నెఱింగి గౌరి నందిమహాకాలను
     జ్ఞాతయై లతామందిరాంతరంబున కరిగి హరచరణసరసీరుహంబులకుం బుష్పాం
     జలి యిచ్చి కృతాంజలి యైన.504
ఉ. ఆవనజాస్యహస్తతలజారుణదీప్తులఁ గూడివచ్చు పు
     ష్పావలిమీఁద నీశు తనజామలరోచులు గప్పి యొప్పె సం
     ధ్యావిరళోర్గతప్రకటితారుణదీప్తులలోన బొల్చుతా
     రావళిమీఁదఁ బర్వునమృతాంశుకరప్రకరాభిరామమై.505