పుట:కుమారసంభవము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

61


దారుసల్లకికరవీరగుగ్గులుపీతసారపున్నాగనమేరుకర్ణి
కారధాత్రీత్వచిసారపటలసహకారభల్లాతకపారిజాత
భూరుహారూఢపికరాజకీరమదమ, యూరమధుకరమృదుమధురారవములఁ
జారుతర మైనభూరికాంతారమహిమ, గారవించుచుఁ జనుదెంచె మారుతంబు.

465


క.

మధుసంగమునఁ ద్రిలోకీ, వధు వనురాగమునఁ గామవశగతిఁ జేతో
విధురవిధి నడరె నట్టిద, మధుసంగతి జనులు రాగమయు లగు డరుదే[1].

466


సీ.

నెలఁతలపరిమళనిశ్వాసపవనంబు దలఁపించె దక్షిణానిలవిలాస
మింతులదరహాసకాంతి సంభావనఁ గావించెఁ జంధ్రప్రభావిభాతి
రమణులరక్తాధరభ్రాంతి నొదవించె లాలితాశోకప్రవాళలీల
వనితలమంజులస్వనశంకఁ బుట్టించెఁ గలకంఠమదకీరకలకలంబు
గామినీవిలోలకర్ణాంతవిశ్రాంతలోచనప్రశంసలోలబుద్ధిఁ
బడసె దలితపదపద్మవిభ్రమము వియోగులందు మధుసమాగమమున.

467


క.

సోలుచు సమ్మదరసమునఁ, గ్రాలుచు వనపాలబాలికలు నవలతికాం
దోలముల వేడ్క సలుపుచు, నాలతు లొగిఁ జేసి పాడి రభినవలీలన్[2].

468


సీ.

కరి యిచ్చె నరమేసి కరిణికి సల్లకీపల్లవ ముల్లంబు పల్లవింప
మృగ మర్థిఁ గబళించి మృగి కిచ్చె నంచుదర్భాంకురంబులు చిత్త మంకురింప
హంస పెక్కువ నిచ్చె హంసికి నోర్నోర నెలదూఁడుమొగముల నెలమి మిగుల
భృంగము దావితో భృంగికి దయ నిచ్చె మధుధారముఖరాగమదము దలఁకఁ
గిన్నరుండు గ్రోల్చెఁ గిన్నరివీనుల రాగరసము మేన రాగ మెసఁగ
మధువిడంబనమున మగలును మగువలు, విరలిగొనిరి మదనపరవశమున.

469


క.

ఆమనికి నెలమి విపులా, రామంబులపొల్పు సూచి రాగోత్కటమై
కాముఁడు రతిఁ గని తానునుఁ, గామాతురుఁడై మనోవికారము వొందెన్.

470
  1. అగుడు = అగుట
  2. అలతి = ఆలాపము "వల్లభుమీఁదియర్మిలి నెపంబు మలంగి మనంబులో నరా | గిల్లి కుచాంతరంగమున గిన్నెర మోపి గుణంబు సారెము | న్నల్లనమాట నూల్కొనెడునాలతి సేసి నిజాంగలీల శోభిల్లఁగఁ బాడె దైన్యబలభిధ్వనుధాధరుమంత్రి శ్రీధరున్" హుళక్కి భాస్కరుని దశగతులు. "ఆలతి సేయ భృంగమాలికలకు బెదరి బెదరి" దశ. ఆ.3