పుట:కుమారసంభవము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కుమారసంభవము

తృతీయాశ్వాసము


శ్రీకంధరపరతత్వా । లోకనతత్పరుఁడు నిశ్చలుం డఖిలసుధీ
లోకానందితకల్పా । నోకహుఁ డగుమల్లికార్జునుండు నెగడ్తన్.

244


వ॥

సకలభువనాధీశ్వరుం డైనపరమేశ్వరుండు హరిపరమేష్ఠిపురందరాద్యఖిలసుర
వరపరివృతుండై నిఖిలకులాచలప్రభావవిజితరజతశిఖరిశిఖరమణిరమ్యహర్మ్యతలా
లంకృతోత్తుంగసింహాసనాసీనుండై భృంగిరీట పరిహాసపేశలాలాపహాస్యాలాప
వ్యాకులితలలితహాస్యరసరసాయనపూరితాస్థానమందిరుండై పరమానందంబున
నుండెనంత నక్కడ.

245


సీ॥

రోహిణాచల మనురూఢిగా కం దింత మహనీయరత్నసామగ్రి గలదె
వింధ్యాద్రితో సురల్ విరస మెత్తిరిగాక గ్రహచక్ర మది యింత గడచియున్నె
హాటకరుచియకా కమరేంద్రుగిరి కింత పరమౌషధీప్రభాభాతి యెత్తె
హరుఁ డర్ధపతిచెల్మి కందుండెఁ గా కింత రమ్యమే వసియింప రజతశైల
మజుఁడు దనవిద్య మెఱయ గులాద్రు లొండ్లు । వడసెఁ గా కుర్వి దాల్పంగ భరమె దీని
కనఁగ నగచక్రవర్తి మాహాత్మ్యవైభ । వాలయం బగు పేర్మి హిమాలయంబు.

246


చ॥

సురవరవాహినీధరుఁడు శుభ్రశరీరవిభాసి నీలకం
ధరపరిశోభితుండు గుణధాముఁడు దుంగతనుండు భూధరా
భరణుఁ డుమాసమన్వితుఁ డపారవిభూతిసమేతుఁడై మహే
శ్వరుఁడునుబోలె నొప్పు హిమవంతుఁ డనంతమహత్త్వసంపదన్.

247


సీ॥

హేమాద్రివిస్తార మెంత సప్తాశ్వుండు నిచ్చలు నోరెల వచ్చునట్టె
తారాచలమువ్రేఁకఁదన మెంత వింశతిబాహునిచే నెర్తువడియెనట్టె
పెరిఁగినవింధ్యాద్రి పెం పెంత కలశుఁ డెడగాల మెట్టిన నడఁగెనట్టె
నెగడుమంధరగిరినిలు పెంత కఱభోగి దీర్చినఁ జిఱ్ఱునఁ దిరిగెనట్టె
యనఁగ విస్తారమున వ్రేఁకఁదనమునందుఁ । బెంపునందును నిలుపున బెఱనగముల
నుఱక తనలోన నవ్వుచు నున్నకరణి । వెలుఁగు శీతాద్రి ప్రాలేయవిమలరుచుల.

248