పుట:కుమారసంభవము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక

ఈమహాకావ్యమును రచించిన కవి నన్నెచోడదేవుఁడు. ఇతనికిఁ గవితాప్రౌఢిమను బట్టి కవిరాజశిఖామణి యనియు దిగ్విజయమునుబట్టి టేంకణాదిత్యుఁడనియు బిరుదములు గలవు. ఇతఁడు సూర్యవంశపు క్షత్రియుఁడు. ఇతఁడు కావేరీతీరమున వొరయూరను పట్టణము రాజధానిగా గోదావరీ సింహళ మధ్యదేశము నేలెను. వీనితండ్రి చోడపల్లి. తల్లి శ్రీసతి. ఇతఁడు క్రీ-శ.940లోఁ బాశ్చాత్యచాళుక్యులతో యుద్ధముచేసి రణరంగమున నిహతుఁడయ్యెను. తత్పూర్వము రాజ్యపదభ్రష్టుఁడై యజ్ఞాతవాసము సేసి మరల లబ్ధరాజ్యుఁడై కొంతకాలము రాజ్య మేలెను. ఇతనిగురువును గృతికర్తయునగు మల్లికార్జునఋషి ద్రవిడమండలమున శైవసమయాచార్యత్రయములో మేలిమి గన్న మాణిక్యవాచకునితో వాదించినట్లు తెలియుచున్నది. ఈ కవిశిఖామణిని గురించి యెక్కుడుగా రెండవభాగము పీఠికలో విస్తారము వ్రాయఁదలంచియున్నాను. ఇతడు కలావిలాస మను మఱియొక్క కావ్యమును గూడ రచించెను. అది నాకు లభింపకున్నను దానిలోని పద్యములు కవిసంజీవని, రత్నాకరము, అధర్వణచ్ఛందము, గణపవరపు వేంకటకవి లక్షణశిరోమణిలో నుదాహరింపఁబడినవి. ఆపద్యములలోఁ గొన్నిటి నిం దుదాహరిచినయెడల సుముఖు లెవ్వరైనఁ దద్గ్రంథమును వెదకి దాని ననర్హమగు మరణమువలనఁ దప్పింతురను నాస గలుగుచున్నది.

సీ॥ పృథుల విశ్వంభరారథమున కెదురుగాఁ బూన్పించె నెవ్వాఁడు పువ్వుఁదేరు
      కాంచనాచల కార్ముకమునకు సాటిగాఁ జేపట్టె నెవ్వాఁడు చెఱకువిల్లు
      నవిరళ పాశుపతాస్త్రమునకు వాఁడి మిగిలించె నెవ్వాఁడు చిగురుఁదూపు
      నతులితామర దానవాదిబలంబుల గెలిపించె నెవ్వఁడయ్యళిబలంబు
      నట్టి జగజెట్టి మన్మథుం డఖిలలోకములకు వెఱగొంగ జీవుల మూలకండ
      యతనియిలుఁ జొచ్చి వెడలనియతఁడు గలఁడె | యతనియమ్ములఁ బడకున్నయదియుఁ గలదె.

క॥ తలపోయఁగ రుచులాఱును | గలుగును వాతంబుఁ గ్రిమియుఁ గఫముంజెడు నా
      కలివుట్టు దగయుఁ జెడుఁ ద | మ్ములము పదార్థంబు రాగమూలము ధరణిన్.

చ॥ తొడవులు వెట్టు సంభ్రమముతోఁ దిలకించు మడుంగుగట్టు పైఁ
      బడఁ దడవోప దింపెఱిఁగి పట్టుదు నేర్పులు గట్టిపెట్టుఁ బ
      ల్కెడునెడఁ దొట్రుపాటొదవుఁ గింకకు చేగిలుమన్ సమర్పఁగాఁ ?
      జిడుముడిఁ బొందుఁగాంత పతిచేరిన గూరిమిగల్గెనేనియున్.

చ॥ లలనలు కొందఱాత్మపతులం దగఁగూడినచెయ్వులన్నియుం
      దలఁచి సఖీజనంబులకుఁ దప్పకచెప్పెడు వారు పుణ్యజీ
      వులు చెలి యామినీశుని కవుంగిలి డాయుటె కాక తాల్మికీ
      ల్దొలఁగిన తీరుగీరు నటదోపవు నాకు రతిప్రయోగముల్.