పుట:కుమారసంభవము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కుమారసంభవము

ప్రథమాశ్వాసము

శ్రీవాణీంద్రామరేంద్రార్చితమకుటమణిశ్రేణిధామాంఘ్రిపద్మా
జీవోద్యత్కేసరుం డాశ్రితజనలసితాశేషవస్తప్రభుం డా
దేవాధీశుండు నిత్యోదితుఁ డజుఁడు మహాదేవుఁ డాద్యుండు విశ్వై
కావాసుం డెప్పుడున్ మా కభిమతములు ప్రీతాత్ముఁడై యిచ్చుఁగాతన్.

1


సీ॥

రమణీయశృంగారరజతపర్వతము నా శోభిల్లు సిద్ధవిస్ఫూరిమూర్తి
ఆఫర్వతాగ్రహేమైకశృంగంబు నా నమరు జటామకుటాదిభాతి
ఆతుంగశృంగశిలాపూర్ణసరసి నా బొంగారు జాహ్నవిభూరివారి
అనిమ్నసరసీలిహారమరాళికాపఙ్క్తి నా నొప్పు కపాలలీల
యామహామరాళికాబర్హిణాంభోజపుష్పనిభసముద్ధభోగభోగి
సమితిఁ దాల్చి పొల్చుశంకరుఁ డంబికాధవుఁడు మా కభీష్టదాత గాత.

2


చ॥

హరివికచామలాంబుజసహస్రము పూన్చి మృగాంకుదండ వి
స్ఫురితమలాసితాబ్జమని పుచ్చఁగఁ జాఁచినచేయి చూచి చం
దురుఁ డది రాహుసావి నెఱఁదుప్పలఁదూలఁగఁ జారుచున్న న
య్యిరువురఁ జూచి నవ్వుపరమేశ్వరుఁ డీవుత మా కభీష్టముల్.[1]

3


ఉ॥

వీంగు నపారసత్వగుణవిస్ఫురణం బరమేశ్వరోరువా
మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
లొంగినపేర్మితో సఖిలలోకములుం దగఁ గాఁచుచున్నవే
దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంస్తుతిఁ దేల్చి సమ్మతిన్.

4
  1. సావి= అనెడుభ్రమతో, సావి, సవియొక్క రూపాంతరము. “శాటికల్ సవితదావాసంబు జేర్పంగ రేవుల డిగ్గన్” ఆముక్తమాల్యద. ఆ-౧. మే మిందుఁ బ్రయోగములు చూపునపుడు ముద్రితగ్రంథములనుండి పద్యభాగములను, అముద్రితగ్రంథములనుండి పూర్ణపద్యముల నుదాహరించెదము. ఆంధ్రభాషయందు ముద్రితాముద్రితప్రబంధములలో లేనిపదములకు ద్రవిళకర్ణాటభాషాకావ్యములలో మాకు లభించినంతపట్టు గూర్చెదము. విజ్ఞులు క్షమింతురు గాక.