Jump to content

పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                  సత్యంబునను హరిశ్చంద్రుఁ బోలి
న్యాయమ్మునందుఁ గౌంతేయాగ్రజుని బోలి
                   సాహసంబున సవ్యసాచిఁ బోలి
భూరివిద్యాప్రౌఢి భోజరాజును బోలి
                   హరిభక్తినియతిఁ బ్రహ్లాదుఁ బోలి


తే.

సర్వసర్వంసహాభుజాధూర్వహుఁడు న
భంగుఁ డగువాఁడెపో నృపపుంగవుండు
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

60


సీ.

న్యాయంబు దప్పక నరులఁ గాపాడుచు
                   వసుమతిఁ బాలించువాఁడె రాజు
దుష్టశిక్ష మహాశిష్టరక్షణ కళా
                   వైఖరిఁ జెన్నొందువాఁడె రాజు
కవివందిమాగధగాయకార్థులకెల్ల
                   వాంఛితార్థము లిచ్చువాఁడె రాజు
శరణని వేఁడిన శాత్రవజనునైన
                   వదలక చేపట్టువాఁడె రాజు


తే.

కాక తన పొట్టకై ప్రజఁ గలఁచు దురిత
రతుఁడు వాఁ డొక రాజా తరాజు గాక,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

61


సీ.

మరుదనంగుడు శిబి మాంధాత భరతుండు
                   రంతిదేవుఁడు భగీరథుఁడు పృథుఁడు
శశిబిందుఁడు గయుండు జామదగ్ని దిలీపుఁ
                   డంబరీషుండు యయాతి దాశ
రథి సుహోత్రుఁడు పురూరవుఁడు నాభాగుండు
                   కార్తవీర్యార్జునక్ష్మాపతియును