పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

44


సీ.

ఆరకూటములోన నపరంజి యిడినట్లు
                   చెరువులోఁ బన్నీరు చిలికినట్లు
చౌటినేలను మంచిసస్యం బిడినయట్లు
                   వెలిమిడిలో నెయ్యి వేల్చినట్లు
షండున కందమౌ సకిని గూర్చినయట్లు
                   పేడలోఁ గస్తూరి పెట్టినట్లు
పాడింటిలోన దీపంబు నిల్పినయట్లు
                   వార్ధిలోఁ గురిసిన వానయట్లు


తే.

తొడరి సుజనులు ధరణిలో దుర్జనులకుఁ
జేయు నుపకృతి వ్యర్థమై చెడు గదయ్య,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

45


సీ.

పరమలోభిని దివాకరతనూభవుఁ డంచు
                   ఛద్మచిత్తుని హరిశ్చంద్రుఁ డనుచు
నిర్దయాత్ముని రామనృపశిఖామణి యంచుఁ
                   గడుకురూపిని రతికాంతుఁ డనుచు
పాపకర్ము నభంగపాండవాగ్రజుఁ డంచు
                   సమరభీరుని సవ్యసాచి యనుచు
కుండబీదను మరున్మండలేశ్వరుఁ డంచు
                   మతివిహీనుని భోగిపతి యటంచు


తే.

కవులు కక్కూర్తి నిసుమంత కడుపు కొఱకు
పొగడుచుండుదు రవివేకబుధు లగుచు,
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

46