పుట:కుక్కుటేశ్వరశతకము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

33


సీ.

పొడవైన కారెనుబోఁతుఁ గన్గొని తేంట్లు
                   మదగజేంద్రంబని పొదవునట్లు
దళమైన యెండమావులు సూచి నీళ్ళని
                   చెలఁగి జింకలు దాడిసేయునట్లు
వలయు దవాగ్నిధూమముఁ గాంచి మొగులని
                   చాతకంబులు డాయఁ జనినయట్లు
బూరుగచెట్టుపైఁ బూవులుండుట చూచి
                   చిలుకలు ఫలముకై చేరినట్లు


తే.

ధరణి నధముల దాంభికత్వములు చూచి
చేరి యాచింపఁ దలతురు సూరిజనులు
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

34


సీ.

ఇల జొన్నఁ బడు గ్రుడ్డియెద్దు చాడ్పున మృదు
                   పదగతు లరయక పరుపుకొనుచుఁ
బెనకున నోడిన పిఱికిబంటును బోలె
                   వడి లేక ప్రాసంబు విడిచివైచి
సారెఁ గొక్కెరరీతి జడధుల నెరసుల
                   నెమకుచు మిగులభంగములఁ దోఁగి
పెంటలపైఁ బొరల్వెట్టు రాసభమట్లు
                   పలుమఱు నపశబ్దమునె పలుకుచు


తే.

తస్కరుని చందమునఁ బదార్థములు మ్రుచ్చి
లించుచుఁ జరించు కుకవుల నెంచనేల?
భూనుతవిలాస, పీఠికాపురనివాస,
కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!

35