పుట:కాశీమజిలీకథలు -09.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13]

జయంతుని కథ

97


186 వ మజిలీ

శ్రమణికథ

వత్సా! వినుము శ్రమణి పురుషవేషముతో జయపురంబున శత్రువులతోఁ బోరుచు రిపుబరాధిక్యంబునకుఁ గొంకి యొకవంక దన గుఱ్ఱము నొకయింటి ప్రహరి దాటించి యా పెరటిలోనికిం బోయినది. ఆ యింటిలోనుండి యొక వాల్గంటి వచ్చి యెవ్వరెవ్వరని కేకలుపెట్టుచు నిదానించి చూచి లోపలకుబోయి అమ్మా! మనము చెఱసాలనుండి దాటించిన వీరుడువోలె నున్నాడు. చూడుమనుటయు నొక యువతి యీవలకువచ్చి పెరటిలో గుఱ్ఱమునుదిగి యేమిచేయుటకుం దోచక యిటునటు చూచుచున్న శ్రమణిం గాంచి దాపునకుఁ బోయి యోహోహో? కుమారశేఖరా? యెప్పుడు వచ్చితివి? నీ కతంబున మా రాజపుత్రికచే నేను జాల జీవాట్లుతినుచుంటిని. నిన్ను బంధవిముక్తుం జేసినందులకు ఫలమేమి చూపితివా? రాజపుత్రిక నీకొఱకుఁ బరితపించుచున్నది. లోపలికిరమ్ము, నే నామె పరిచారికను. వసుమతియనుదాన. మీ వార్త దెలియఁజేసి యామె నీరాత్రి నిందు రప్పించెద. నీవుచేసిన వాగ్దత్తము చెల్లించుకొను మని పలికినది.

శ్రమణి యా మాటలన్నియు విని యవి తన యన్నగారి చర్యలనియు నతండు విముక్తుఁడయ్యెననియు నిశ్చయించి తల దాచుకొనుటకు మంచితెరవు దొరికినందులకు సంతసించుచు దానివెంట లోపలికిఁ బోయి తన్నిర్దిష్టమగు విష్టరంబునఁ గూర్చుండి మెల్లన దాని కిట్లనియె.

కాంతా! మీ నగరాంతమున జరుగుచున్న యుద్ధవృత్తాంతము నీవు వినియే యుందువు. నాకు వెనుక సహాయము లేకపోవుటచే శత్రుబలప్రాబల్యంబునకు నొదిగి యుండవలసి వచ్చినది. కొన్ని దినములు మీ యింట నుండెద. రహస్యభేదము సేయక నగరవిశేషంబులఁ దెలుపుచుండవలయును. మీ రాజపుత్రిక నీ యాజ్ఞకు బద్దుండనై చెప్పినట్లు నడచువాఁడనని పలికిన విని పరిచారిక మిగుల సంతసించుచుఁ గుమారా! మేమెల్ల నీ యాజ్ఞాబద్ధులమై యుండెదము. మా యింటనుండ నిన్నుఁ బరమేశ్వరుఁడు దెలిసికొనఁజాలడు. శత్రురహస్యములఁ దెలిసికొనివచ్చి చెప్పుచుండెద. రాజపుత్రిక నీరాత్రి యిందుఁ దీసికొనివచ్చెదని ముచ్చటింపుచు సకలోపచారమును గావించినది.

చీకటి పడినతోడనే రాజపుత్రికయొద్ద కరిగినది. దాని జూచి కనకలతిక యేమే? పురవిశేషము లేమైనం దెలిసినవియా? మొన్న మనచే విముక్తుండైన చిన్నవాడు దాగికొనక మఱల గుఱ్ఱమెక్కివచ్చి మనవారితోఁ బోర నారంభించెనఁట వింటివా? అనిచెప్పిన ముసి ముసి నగవుతో నౌను. వినుటయేకాక చూచితిని, మాట్లా