పుట:కాశీమజిలీకథలు -09.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

అందులకు నేఁడు మంచిదైనదికాదు. రేపు సుముహూర్తముంచితిమి ఆ శుభము జూచిపోవుదురుగాక. మీరరుగకున్న నున్నవారు వైరులఁ బరిమార్పఁజాలరా? మీ తండ్రిగారి పరాక్రమము సామాన్యముగాదు, మీరిందువచ్చినందులకు సత్కారమైనఁ జేయలేదు. ఈ రెండుదినంబులు వసించిపోవుదురుగాక అని శృంగారలీలావిలాసములు ప్రకటించుచుఁ బ్రార్థించుటయు నతం డేమాటయు బలుకనేరక యూరకుండెను.

అని యెఱింగించి యవ్వలికథ దరువాతి మజిలీయందుఁ జెప్పందొడంగెను .

185 వ మజిలీ

రాగవతి - అమ్మా! నీవింత యాలసించితివేల? యెక్కడికిఁ బోయితివి.

అశోకవతి - పుత్రీ! నే నెప్పుడు బయలు వెడలితినో కాని యేకార్యము కొనసాగినది కాదు. వినుము. ఆదిత్య వర్మయను పండితవీరుని సహాయమున దొలుత దుందుభియొద్దకుఁ బోయితిని. అందెవ్వరుఁ గనంబడలేదు. వాని చెల్లెలు శ్రమణి దారిలో రామచిలుక యొద్ద శకునము లడుగుచుండఁ గనంబడినది మే మందరము గలసి జయపురంబున కరిగితిమి. అంతకు ముందే రాజువాహనుడు కారాగారమునుండి పారిపోయెనఁట. శ్రమణి పురుషవేషము వైచికొని నప్పుడు అచ్చముగా రాజవాహనునివలె నుండెను. గుఱ్ఱమెక్కి వీథి నరుగుచుండ నామె రాజవాహనుఁడని రాజభటు లాటంకపరచి పట్టుకొనఁబోయిరి. వారితో బెద్దయద్దము జేసినది. ఆదిత్యవర్మయు, శ్రమణిని వరించి వెనువెంట వచ్చిన సునందుఁడను రాజపుత్రుఁడును ఆమెకుఁ దోడుపడి రాజభటుల నెల్లఁగాందిశీకుల గావించిరి.

అప్పుడు పట్టణ మంతయు నల్లకల్లోలమై శత్రువులు ముట్టడించిరని భయపడుచు నలుదెసలకుఁ బారఁ దొడంగెను. మధువర్మయు మందపాలుఁడు అసంఖ్యాకములైన తమ సైన్యముల నానగరము జేర్చియుంచిన కతంబున నేల యీనినట్లురాజభటులు నగరమంతయు వ్యాపించి మనవారితో ఘోరముగఁ బోరు గావింపుచుండిరి.కోటానకోటలుగానుండు రాజభటులనెల్ల సాగరమును మంధరమువలె నీ మువ్వురుసంక్షోభము నొంద జేసిరి. ఆదిత్యవర్మకును సునందునకును వాహనములులేవు తగిన యాయుధములు లేవు. శ్రమణి మాత్రమే యశ్వారూఢయై పోరుచుండెను. మూడుదినము లేకరీతి సాంపరాయము జరిగినది. శత్రుణరాధిక్యము వలన నిలువఁజాలక యాదిత్యవర్మ యెట్లో తప్పించుకొని దాటిపోయెను. శ్రమణియు నలసి యే మూలకో పారిపోయినదని విన్నాను. సునందుఁడు శత్రువులచేఁ బట్టువడియె. ఇంతవట్టు చూచి యందుండిన నన్నుఁగూడఁ పట్టికొందురని భయపడి పులిందునకు మఱియొక వర్తమానము బంపి నేనిందు వచ్చితిని. శత్రువుల బలాబలములఁ దెలిసికొనకుండ నా యూరుపోవుట తప్పు