పుట:కాశీమజిలీకథలు -09.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయంతుని కథ

87

యుపేక్షించితినని నా యపఖ్యాతి స్థిరంబై యుండఁగలదు. ఈవార్త దేవలోకము లన్నియు వ్యాపించియున్నది. ఇప్పుడు మీరా పక్షులకడకువచ్చి ముచ్చటించి యెట్లో యాతీరుపు మాపుజేయించుకొనవలయునని గట్టి పట్టుపట్టిరి.

జయంతు డొకింత విచారించి కానిండు ఆయండజము లేపాటి పాండిత్యము గలవియో చూచెదంగాక. నన్నుఁ దప్పుపట్టుట కెట్టి సామర్థ్యమున్నదియో పరీక్షించెదంగాక పదుఁడు పదుఁడు. దారిఁ జూపుఁడని కోపోద్దీపితమానసుఁడై యింద్రసూనుండు వారివెంట నాపిట్టలున్న చెట్టుకడకుం బోయి నిలువంబడుటయు నచ్చర లుచ్చస్వరంబునఁ బారావతశకుంతములారా! యిటురండు మహారాజకుమారుం డిందు వచ్చియున్నవాఁడని కేకబెట్టిరి.

అప్పులుగు లప్పులుకులు విని బెదరుగదురఁ గల్పతరుకోటరము నుండి చెచ్చెర నచ్చటికింజని జయంతునికి నమస్కరింపుచు దేవా? సెలవేమి? మీ దాసులము. కబురంపిన మే మేలిక పాదమూలమునకు రామా? మీ రిందేల రావలయునని యడిగిన నతండు కన్ను లెఱ్ఱఁజేయుచు మీరిందుఁబెద్దలై మాకుఁ దప్పులు దిద్దుచుండ మా యాజ్ఞకు బద్ధులై వత్తురా? కానిండు కుంకలు మీతగవరితన మేమియో చూచెదం గాక. నన్నుఁ గళామూఢుండని చెప్పితిరఁట యెట్లు? నాతప్పెందుఁ బరీక్షించితిరి? చెప్పుఁడని యడిగిన గడగడలాడుచు నా నీడజములు స్వామీ! రక్షింపవలయును.

గీ. తన్నుఁ దగవరిగాఁ గోరి ధర్మమడుగ
    నొదిగి మోమాటము వహించియున్న నిక్క
    మెఱుఁగఁజెప్పక యొకపక్షి మెఱిఁగి పలుకు
    నతండు నరకంబు జెందెడు నండ్రు బుధులు.

దేవా! పాపంబునకు వెఱచి మాకుఁ దోచిన ధర్మంబు చెప్పితిమి మాతప్పు మన్నింపుడు.

జయంతుడు - కుంకలారా! మీరెఱింగిన ధర్మమేదియో చెప్పుఁడని యడుగుచుండ నక్కవినయములు చూపెదరేల ?

పక్షులు -- మహారాజకుమారా ! మీకును నలకూబరునకు శృంగారకళావైదగ్ధ్యమందుఁ దారతమ్యం బెఱింగింపుమని యచ్చరలు మమ్ముఁగోరిరి.

జయం - మీరు మహావిద్వాంసులని మిమ్ముగోరినారు! సరే మీరు నాయందుఁ జూచిన లోపమేది?

పక్షు - దేవా! మీ రట్లలుకఁ జూపిన మాకేపలుకును రాకున్నది. శాంతము వహింపవలయును.

అచ్చరలు - తగవుచెప్పినట్లే యగుననుకొనిరా? ఈతండెవ్వడో యెఱుగుదురా? త్రిలోకాధిపతియైన మహేంద్రునిబట్టి ముందువెనుక వినురింపవలదా? ఇప్పు డాయన యడిగెను. నుడువులకు సమాధానము జెప్పుఁడు