పుట:కాశీమజిలీకథలు -09.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దుందుభి కథ

13

పుళిందిని - పట్టీ! గొప్పవారికి జాబులు వ్రాయునప్పుడు వారివారి మర్యాదల ననుసరించి వ్రాయవలసియున్నది. ఏది యెట్లు వ్రాసితివో వినిపింపుము.

రాజ - అమ్మా ! నేను చెల్లితో నాలోచించియే వ్రాసితిని, వినుము.

మహారాజాధిరాజ రాజపరమేశ్వర రాజమార్తాండాది బిరుదాంకితులగు వసుపాల మహీపాల చక్రవర్తిగారి సముఖమునకుం పుళిందచక్రవర్తిగారి కుమారుఁడు రాజవాహనుఁడు వ్రాసికొన్న విజ్ఞాపనపత్రము. మీ కుమారిత కల్పలత నిమిత్తమై యుత్తమపతత్రములఁ బంపుమని మా తండ్రిగారిపేర మీరు వ్రాయించిన చిత్రలేఖ చేరినది. మా తండ్రిగారు పశుపక్షిమృగాదులం బట్టుటకై దూరికాంతారమున కరిగిరి. పదిదినములు తాళి వెండియు మీ దూతలం బంపితిరేని యుష్మత్పుత్రికారత్నమనోరథము సఫలముఁ చేయగలము. అని వ్రాసితిమి. బాగున్నదా!

తల్లి – పుత్రా ! ఈ బిరుదము లన్నియు మీకెట్లు తెలిసినవి ?

రాజ - వారి పరిజను లెఱింగించిరి.

తల్లి - మీ పత్రికలోఁ జివర వ్రాసినమాట వ్యంగ్యముగా నున్నది బాబూ! మనోరథము సఫలము జేయుదుమనిన శంకింతురు. అది తీసి మఱియొక మాట వ్రాయుము.

రాజ - పోనీ, నీ కూఁతురి యభిలాష తీర్తుమని వ్రాయవచ్చునా?

తల్లి - అదియును బాగులేదు.

రాజ - కోరికతీర్తు మనిన తప్పా?

తల్లి – మనోరథము, అభిలాష, కోరిక, ఇవి యన్నియుఁ బర్యాయ పదములే. ఆ మాట లేమిటికి? మీరు కోరిన పక్షులం బంపుచున్నామని వ్రాయ రాదా?

కూఁతురు - అమ్మా! శంకించుకొనిన నన్నియుఁ దప్పులుగానే కనంబడుచుండును. మనోరథ మనినఁ దప్పులేదు. తుడుపు వలదు. అదియే యుండనిమ్ము, అన్నా! పత్రిక మడిచి యిచ్చి వారిం బంపివేయము.

అనుటయు నగుమొగముతో రాజువాహనుఁ డా పత్రికపై వ్రాలుజేసి వారికిచ్చి యంపెను. మఱికొన్ని దినంబులకు దుందభి యనేక విధమృగపక్షిజాతులం బట్టించుకొని యట్టహాసముతో నింటికివచ్చెను.

వాని పరిజను లాయాసత్వంబులం బోనులం బెట్టియుఁ గట్టియు, బక్షిజాతులఁ బంజరంబులం జేర్చియు నాయాశాలలు నిండించిరి. రాజవాహనుఁడు చెల్లెలితోఁగూడఁ దండ్రియొద్దకుఁ బోయి వసుపాలుఁడు పంపిన వర్తమానము దెలియఁజేయుచుఁ దండ్రివెంటఁ గొత్తగాఁ దెచ్చిన జంతువులం జూడ నాయాయి సాలలకుం బోయి