పుట:కాశీమజిలీకథలు -09.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సునందుని కథ

63

నాఁటి మధ్యాహ్నమే చిలుక సునందన కుత్తరము వ్రాయించినది. నీ భార్య యిక్కడనే యున్నది.

ఆ యుత్తరముఁ జూచుకొని వడివడి పరుగునఁ బోయి యతండు శ్రమణి కావ్రాత చూపించెను. అత్తరుణి చిఱునగవుతో బరికించి ఇఁకనేమి? మీ యదృష్టము ఫలించినదిగాక! ఇక్కడనే యున్నదఁట ఎవ్వరు జెప్పనక్కరలేదు. నే నేదియో చెప్పవలయునని తలంచుచుంటిఁ జిలుకయే చెప్పినదని పరిహాసగర్భితముగా బలికిన నతం డిట్లనియె.

ఈ రామచిలుక యథార్ధవేత్తయని భ్రమసి రెండుసారులు దీనికడ కరుదెంచితిని. దీని మాట నాకుఁ దార్కాణముగాఁ గనంబడలేదు. ఇక్కడనే యున్నదని చెప్పినమాట యెంత సత్యమో విచారింపుము. ఇం దెవ్వరున్నారు రేపు మీ మాటకు వచ్చిన ప్రత్యుత్తరముఁ జూచుకొని మనము పోవుదముగాక. ఇక నెన్నెఁడు నిక్కడకు రాఁగూడదని పలికిన విని యా కలికి చూపు లతనిపై వ్యాపింపఁ జేయుచు నిట్లనియె.

సునందా! దాని నిప్పుడే నిందింపరాదు. అఘటితఘటనాలంపటుడగు భగవంతుని సంకల్పము లెవ్వరికిఁ దెలియును? మీ నిమిత్తమయి యేమచ్చకంటియైన నిచ్చటికి వచ్చియున్నదేమో యెవ్వడెఱుంగునని పలుకుటయు సరే చూతముగా? అని యతండు తలయూచెను. కవఁగూడి తిరుగుచు వారు నాఁ డెల్ల బరిహాసగర్భితములైన మాటలచే గడిపిరి.

మఱునాఁడు శ్రమణి యడిగిన ప్రశ్నమున కిట్లుత్తరము వచ్చినది. కిరాతకులము పురుషుఁడు. అను దానిమీఁద గీటులు గీయబడి యున్నవి. నీ వడిగిన పురుషుఁడు చెరసాలనుండి నిన్ననే విముక్తు డయ్యెను.

అని యున్న యుత్తరముఁ జూచుకొని శ్రమణి ఆహా! ఈ చిలుక నిజము గ్రహించు ననుమాట కొంతసత్య మున్నది. నేను బురుషుఁడగానని గీటు గీచినది లెస్సయే. కులముగూడ గీటుపెట్టుచున్న దేమి? మొన్న మా యన్నకు నిట్లే వ్రాసినదఁట. ఇం దేదియేని రహస్య మున్నదేమో విచారింపవలసియున్నది. బుద్ధిః కర్మానుసారిణీ అను నార్యోక్తి ననుసరించి నాడెందము సునందునందుఁ దగులమైనది. చిలుక చెప్పిన మాటలంబట్టి చూడ నిది దైవసంకల్పితమనియే తోచుచున్నది. కానిచో సోదరుఁ డందు జిక్కుపడి యున్నవాఁడని వినియు నా కీ శృంగారలీల లేమిటికి రుచింపవలయును? కానిమ్ము. ఇతం డొకదేశమున కధికారి. సమధికవిద్యారూపశీలసంపన్నుఁడు. అల్పకులసంజాతనగు నా కిట్టిభూపతిపట్టి పతిగా లభించుట కల గాదే! అని యాలోచించుచున్న సమయంబున సునందుఁడు వాకిటకు వచ్చి మహిళాంగీ! మహిళాంగీ! అని కేక పెట్టి అయ్యో! పొరపాటున నట్లు పిలిచితిని. మహిళాంగా! యేమి చేయుచున్నావు? చిలుక నీప్రశ్నమున కుత్తర మిచ్చినదఁట.