పుట:కాశీమజిలీకథలు -09.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

శూన్యము జేసిపోవును. అంతలో దైవ మీస్వరూపమున నరుగుదెంచి యా దంతావళము దంతములు పట్టుకొని నిలువంబడి మచ్చికఁజేసి పండుకొనఁ బెట్టెను. ఆ వివాహదంపతులు దిగి యా పురుషునకు నమస్కరించి మరల నది లేచునను వెఱుపుతో నొకయింటిలోనికిం బోయిరి. చచ్చినపాముం జంపుట కందరు శూరులేకదా? అది పండుకొనియుండ తుపాకులు కాల్చి రాజభటులు దానిం జంపిరి.

ఆ మరునాఁ డాపురుషుని నిమిత్త మీపుర మెల్ల వెతకించిరి. ఎందును గనంబడలేదు. భగవంతుఁ డట్లు వచ్చెనని నిశ్చయించిరి. రాజపుత్రిక వానియాకారము కన్నులార జూచియున్నది. కావునఁ జిత్రపటంబున నీరూపము వ్రాసి యిచ్చినది. దానిఁబట్టి యంత్రమున ననేక చిత్రప్రతిమలు తీసి గ్రామమంతయు వ్యాపింపఁజేసిరి. ప్రతి గృహమునందును దాని దేవతఁగా నునిచి ప్రజలు పూజించుచుండిరి.

రాజపుత్రిక సహస్రదళపద్మములచే నిత్య మీపురుషరత్నము ప్రతిమను బూజించుచున్నదఁట. మఱియు సత్రములయందు, దేవాలయములయందు, మఠముల యందుఁ బెద్దరత్నఫలకములలోఁ జేర్చి యిట్లు వ్రేలఁ గట్టించిరి. ఇదియే దీనివృత్తాంత మని యెఱింగించిన విని యవ్వనితారత్నము గనుల నానందబాష్పములు గ్రమ్మ నట్టిపని తనసోదరుఁడే కావించినవాఁ డని నిశ్చయించి కన్నులు మూసికొని యించుక ధ్యానించినది.

అప్పు డాసత్రాధికారి దానిపోలిక పరీక్షించి యొక్కటిగా నుండటఁ దెలిసికొని రహస్యముగా నాఁడు మదరికం బట్టిన జెట్టి వచ్చి యున్నవాఁడని రాజపురుషులకు వర్తమానము పంపెను. ఈ లోపల బ్రజలకు దెలియుటచే నాటిమహాత్ముఁడు సత్రంబునకు వచ్చియున్నవాఁడట. చూతము రండు రండనుచు గుంపులుగా వచ్చి చుట్టుకొని నమస్కరించువారును, మీఁదఁ బూవులు జల్లువారును, ఫలము లర్పించువారును, హారతులిచ్చువారునై సేవింపుచుండఁ జూచి శ్రమణి సత్రాధికారితో నయ్యా! ఇది యేమి? ప్రజ లిట్లు వచ్చుచున్నారని యడిగిన నతం డిట్లనియె.

దేవా? నీవు నిజము గోప్యము చేసినను నా చిత్రఫలక మీతఁడే నీవని చాటి చెప్పుచున్నది. మాణిక్యమును మూఁటకట్టినఁ ధత్ప్రభలు బయలపడకుండునా? మీయందుఁగల విశ్వాసముతోఁ బ్రాణదాత వగు ని న్నిట్లు పూజించుచున్నారని పలుకు చుండఁగనే యతనికై వేచి తిరుగుచున్న రాజపురుషు లావార్త విని కనకాలబోకరముఁ బట్టించుకొని మేళతాళములతో నచ్చటికి వచ్చి ప్రజలం దప్పించుకొనుచు లోపలఁ బ్రవేశించి నమస్కరింపుచు మహాత్మా! నేటికి మాయం దనుగ్రహం గలిగినదియా? నీనిమిత్త మెన్నిదేశములు దిరిగుచుంటిమి. కానిండు, రండు. రండు. పల్లకీ యెక్కుఁడు. మామహారాజు మీనిమిత్తము యెదురుచూచుచున్నాఁడని పలుకుచు నతఁడు చెప్పుమాట లేమియు వినిపించుకొనక చేతులు పట్టుకొనఁ బోవుటయు వలదు వలదు అని వారించుచుఁ దానే లేచి తిన్నఁగాఁ బోయి యాపల్లకీలోఁ గూర్చుండెను. తూర్యనాదములు