పుట:కాశీమజిలీకథలు -09.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8]

శ్రమణి కథ

57

విశేషాదుల నడుగుచు వింతలం దెలిసికొనుచుఁ బోవుచుండెను. ఒకనాఁడు దారిప్రక్క ననతిదూరములో సమున్నతశిఖరగోపురప్రాసాదసౌధప్రకాశమానమగు శ్యామలానగరమును జూచి యప్పటికి జాము ప్రొద్దెక్కుటచే నాపూట కందు వసింపఁదలఁచి తన ఘోటకము నావీటిమార్గమున నడిపించెను.

జను లతనియాకారము జూచి వెఱఁగుపాటుతో మూగి వెంటరాఁదొడంగిరి. రాజవాహనుఁడువలె విల్లమ్ములుదాల్చి మహావీరపురుషవేషముతో నొప్పుచుండెను. పట్టణంబునఁ గొన్ని వీథులు మాత్రము చుట్టుతిరిగి పరదేశులు వసించు సత్రమునకుం బోయి యందు గుఱ్ఱమునుదిగి వాకిటఁ గట్టి కొంచెముసే పందొక చావడిలో విశ్రమించినది.

అంతలో సత్రాధికారి వచ్చి తదాకారవిశేషమున కచ్చెరువందుచు నెవ్వఁడో మహారాజకుమారుండని నిశ్చయించి వినయముతో జెంతకు వచ్చి దేవా! మీ రీవాకిట వసింప నేల! లోపలకు రండు. చిత్రశాలలో విశ్రమింపుఁడు. మీ గుఱ్ఱమునకు మేత వేయించెద. వంటయైనది. భుజింపవచ్చునని పలికిన విని సంతసించుచు నమ్మించుబోఁడి యాఁకలిఁ గొని యున్నది. కావున నతనివెంటఁ బోయి స్నానాదికముఁజేయక యాదస్తులతోనే భుజించినది.

భోజనానంతరము వెండియుఁ జావడిలోఁ గూర్చుండి తాంబూలము వేచుకొనుచు యందలివింతలం జూచుచుండెను. సత్రాధికారి దాపున వసించి పరిజనులచే విసరింపుచు నామె యడిగినమాటలకు సమాధానముఁ జెప్పుచుండెను.

ఆ చావడిలో నెదురుగాఁ బెద్దయుద్ధములో ననర్ఘకనకమణిపటలఘటితముగా నొకప్రతిమ చేర్పఁబడి యున్నది. దానిం జూచి శ్రమణి వెఱఁగందుచు నయ్యా? ఈ చిత్రఫలక మెవ్వరు వ్రాసిరి? ఎవ్వరిది? అని యడిగిన విని యతం డిట్లనియె.

సౌమ్యా! ఈ మహానుభావుని కులశీలనామము లేమియుఁ దెలియవు. ఇతండు మాదేశమునకు, మా పట్టణమునకు, మా ప్రజలకు, మా రాజునకుఁ గావించిన యుపకార మిట్టిదని చెప్పఁజాలను. ఈతం డడ్డపడకున్న మానగర మీపాటికి శూన్యమై యుండును. వినుండు. మా రాజునకు శ్యామల యను కూఁతు రొక్కతియే కలదు. భూమండలమంతయు వెదకి యొక రాజకుమారుం దెచ్చి వివాహము గావించి మహావైభవముతో నాలుగవనాఁ డూఱేగింపుటుత్సవము సేయుచుండెను. కొంతదూరము పోవునప్పటికి యా వధూవరు లెక్కిన యేనుగునకు మద మెక్కి దొరికినవారి నెల్లఁ బట్టికొని చంపఁదొడంగినది. పెక్కేల గడియఁలో బదివేలమందిని మడియఁ జేసినది. దానిమీఁద నున్న పెండ్లికొడుకు పెండ్లికూఁతుల గౌఁగలించుకొని యంత్యకాలభగవన్నామస్మరణ జేయుచుండెను. ఆ మతంగము నిరాటంకముగా వీధులఁదిరుగుచుఁ ప్రజావధ జేయుచుండ నే వీరుఁడు నిలుపలేకపోయెను.

మఱిరెండుగడియ లామతంగ మట్లు సంచరించినచోఁ బట్టణమునం