పుట:కాశీమజిలీకథలు -09.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

సాగరా! హా! సౌందర్యమందిరా! నిన్నింటికడ సుఖముగా నుండనీయక యాపత్సముద్రములో ముంచుటకై లేవదీసికొని వచ్చితిని. పెద్దపులుల వశ మైతివి. నిన్నెవ్వరు విడిపింపఁగలరు? నీ శౌర్యమున కసూయఁ జెంది యీ దుర్మార్గులు నిన్ను జంపక విడుతురా? అయ్యో? నేనేమి చేయుదును. ఈ వార్త వినినఁ గల్పలత ప్రాణములు భరింపగలదా? తలిదండ్రు లేమి సాహసముఁ జేయుదురో? శ్రమణి యెంత చింతించునో యన యనేకవిధంబులఁ బలవరించుచు నక్కటా? వాని కనుసన్నల మెలఁగు నాయశ్వం బీదారినిరాక యా దారిఁ బోవుట దైవసంకల్పితమని తలంచెదను కానిమ్ము. మా వసుపాలునకుఁ బెక్కండ్రు మిత్రులు ధాత్రీపతులు గలరు. వారి కందరుకుం జెప్పి యెట్లయిన వాని విడిపుంచుతెరు వరసెదంగాక. ఈ వార్తవినిన శ్యామలాపుర భర్త సహాయముఁ జేయకుండునా? అని యనేక కోపాయము లాలోచించుచు ముందుగా నీ వార్త కల్పలత కెఱింగించి తరువాతఁ దగు ప్రయత్నము సేసెద నని నిశ్చయించి యనుచరులుగూడరా మహేంద్రపురంబున కరిగినది. అని యెఱింగించి యవ్వలి మజిలీయం దిట్లు చెప్పదొడంగెను.

179 వ మజిలీ.

ఆదిత్యవర్మ కథ

మహేంద్రనగరమునుండి జయపురంబున కరుగు మార్గములో దక్షిణదేశమునుండి యుత్తరదేశమున కడ్డముగా నొకబాట పోయినది. ఆ నాలుగుతెరువులు గలిసినచోట వసుపాలునిచే నొకసత్రము గట్టింపబడి యున్నది. మార్గస్థులు వచ్చి వంటఁజేసికొని భుజించి పోవుచుందురు. అందులకుఁ దగిన సదుపాయము లన్నియు నందున్నవి.

అందొకనాఁడు ఆదిత్యవర్మయను బ్రాహ్మణుఁడు తగుపరిజనులతో వచ్చి బసచేసి వంటఁ జేసికొనుచుండెను. అంతలో వసుపాలుని దూతలు కొందఱు వచ్చి మహారాజుగారి యుద్యోగస్తులు వచ్చుచున్నారు. ఇం దెవ్వరు నుండఁగూడదు. చోటు చేయుఁడను కేకలుపెట్టిరి బాహ్మణుఁడు వంటఁజేసికొనుచున్నాఁడు. సగము వంట యైనది. భుజించిన తరువాత వెళ్ళిపోయెదమని యాదిత్యవర్మ భృత్యుడొకడు వారికి సమాధానముఁ జెప్పెను.

అట్లు పనికిరాదు. గదులు మాకు కావలయు నిప్పుడే లేచిపోయి యవ్వలగదులలో వండుకొనుమనుము. ఇది గొప్పవారు దిగుచోటు. ఇందు సామాన్యులు వసింపరాదు. తొలగుండు అని కింకరులు తొందగ చేసిరి. సార్ధవాహుడును "నాబ్రాహ్మణుఁడు గొప్పవాఁడే. మహారాష్ట్రదేశప్రభువునకు మిత్రుఁడు. పనిగతిని యుత్తరదేశమునకు రాజు నానతి నరుగుచున్నాడు. భుజించి పోయెద" మనిప్రత్యుత్తర మిచ్చుచుండెను.