పుట:కాశీమజిలీకథలు -09.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వ్రేలంగట్టిన బంగరుపంజరములోనున్న వింతశకుంతముతో ముచ్చటింపుచుండిరి. అశోకవతి వారిద్దరిం జూచి దద్దరిల్లి యుల్లమున విస్మయరసంబు వెల్లి విరియ అమ్మ నేజెల్ల! వీరెక్కడి కిరాతసూతులు ఆహా! ఏమి? యీకుమారుని సౌందర్యము? కంతువసంతజయంతాదులు వీనిగోటికి సాటిరారే! అయ్యారే! వీనిమొగ మెంత వింతగా నున్నది? వీనిబుగ్గలు గిల్లిన పాలుగారునట్లున్నవిగదా. ఆ వెలికన్నులచెన్ను తళ్కు వేయేండ్లు చూచినను దనివితీరునా? ఓహోహో! ఎక్కడి యరణ్యదేశము? ఎక్కడి కిరాతకులము? ఎక్కడి చక్కదనము? నిజముగ వీఁడు పుళిందచక్రవర్తి కాఁడు. నరేంద్రచక్రవర్తియే! కానిచో నిట్టి సంతానముఁ బడయునా? అని యాశ్చర్యముగా వారివంక చూచుచు నేమియు మాటాడలేక నిలువంబడి యుండెను.

అప్పుడు రాజువాహనుఁడు జవ్వనీ! నీ వెవ్వరిదానవు? ఎవ్వరి నిమిత్త మిందు వచ్చితివి? ఆ పెట్టెలో నేమి యున్నది? చెప్పుమని యడిగినఁ దదీయమృదుమధురగంభీరస్వరమునకు మఱియు మురియుచు నమస్కరించి యిట్లనియె.

తరుణీమనోహర! నేను మహేంద్రనగరాధీశ్వరుని పుత్రిక కల్పలత పరిచారకును. నా పేరు అశోకవతి యండ్రు. మిమ్ములఁ జూచుటకే యిక్కడికి వచ్చితిని. మా రాజపుత్రిక మీమైత్రి కోరి మీకుఁ గొన్ని వింతవస్తువులు పారితోషికముగాఁ బంపినది. ఆ పెట్టెలలో నున్నవస్తువు లవియే యని చెప్పిన నవ్వుచు శ్రమణి యిట్లనియె.

అన్నా! నీకుఁ గల్పలత యన నెవ్వతయో తెలిసినదా? మన ముద్దులమూట నీ వరాలపేటిక నెంత సొమ్మిచ్చియైనఁ గొని తీసికొనిపోదలంచిన మించుబోఁడి. ఇప్పు డందులకే మరల నీజవరాలిం బంపఁబోలు ఏమమ్మా! నిజము చెప్పుము ఆ చిన్నది మాకుఁ గానుకల నేల పంపవలయును?

అని యడిగిన ముసిముసినగవుల నవ్వుచు అమ్మయ్యో! అమ్మాయీ? మీ యూహలు బహుకల్పనలతో నొప్పుచున్నవే. మా రాజపుత్రిక యంతఃపురముఁ జూచిన నిట్లనకుందువుగదా. పని మాటకేమి? మీ సౌందర్యచాతుర్యాదివిశేషములు పరిజను లెఱింగింప విని యానందించి మీ మైత్రికొఱకుఁ గానుకల నంపినదిగాని మీరియ్యమనిన మీపిట్టను బలవంతముగ లాగికొని పోవునా యేమి? ఆమె యౌదార్యము కడు విచిత్రమైనది. మీరు వచ్చి యామెయొద్దనున్న వస్తువేది యైనను సరే యడిగిన నీయక మానదు. స్నేహమే ప్రథానము అని యామెగుణములఁ బ్రశంసింపుచుఁ దాను దెచ్చిన యాటవస్తువులఁ గనకమణిగణఘృణినికరంబులు గన్నులకు మిఱిమిట్లు గొలువఁ బెట్టెలనుండి తీసి వారి కర్పించినది. అందు -

మరచక్రము త్రిప్పి బల్లపై నిలిపినంత వడిపడి నడుచు నేనుగులు, గుఱ్ఱములు, రథములు, కాల్బలములు, వింతగా నెగురు పక్షులు చిత్రముగాఁ బ్రాకు పురుగులు మిక్కిలి విస్మయము గలుగఁ జేసినవి. అయ్యాటవస్తువులం జూచి మెచ్చుకొనుచు వసుపాలుని యైశ్వర్య మెట్టిదో యనియుఁ గల్పలతయం దెంత ప్రీతియో