పుట:కాశీమజిలీకథలు -09.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

వచ్చును. పైవృత్తాంతము నాకేమియుఁ దెలియదు నా జోడుపక్షికి వచ్చునని చెప్పినది.

అక్కటా! యెట్టి చిక్కు వచ్చినది? పతంగమా! నిజముగా నీ కీకథాశేషము రాదా! ఆహా! మంచియంతరములో నంతరాయము గలిగినదే అని పరితపించుచుఁ గల్పలత శోకవతియను పరిచారికతో సఖీ! పుళిందకుమారుఁడు సెప్పినగడువు దాటి చాలదినములైనది, పక్షులనిమిత్తము వెండియుఁ గింకరులఁ బంపమని జెప్పుము. దీనిజోడు పక్షి నాపుళిందుఁడు పట్టుకొనెనని యీశకుంతమె చెప్పినదిగదా? దాని నెంతవెలకైనఁ గొనుమని ప్రత్యేకముగాఁ జెప్పుమని బోధించి దాని నప్పుడ తండ్రియొద్ద కనిపినది.

ఆ పరిచారిక వసుపాలునికిఁ గూఁతురి సందేశ మెఱింగించుటయు నప్పుడే యానృపతి యపరిమితధనముతోఁ గింకరుల నాపుళిందునొద్ద కనిపెను.

రాజభటులు పటురయంబునఁ గిరాతనాథునింటికింబోయి యుత్తరముతో నతనిసందేశ మెఱింగించిరి. సత్యవంతుఁడు బిడ్డలతోఁ జెప్పి అప్పటికి సిద్ధముగా నున్న పక్షివిశేషములనెల్ల నేఱి పంజరములతోఁ గూడ వారి కర్పించి తగినవెలలఁ దీసికొని ప్రత్యుత్తర మిట్లు వ్రాసెను.

వహారాజా! మీరు వ్రాయించిన జాబు చేరినది. మాయొద్ద నున్న పిట్టల రకములన్నియు నుచితమగు వెలఁ దీసుకొని మీకింకరుల కిచ్చితిమి. మఱియు మీరు వింతశకుంతము జోడుపక్షి మీయొద్ద నున్నట్టున్ను రెండవది మాకుఁ జేరినట్లున్ను దాని నెంతవెలఁ దీసికొనిననుసరే తప్పక పంపవలయునని వ్రాసిరి. దాని నాకూఁతురు, గొడుకును స్వయముగాఁ బెంచుకొనుచున్నారు. దాని నెంతవెల యిచ్చినను నియ్యనీయరు. మీకవసరములేక రెండుపిట్టల నొకచోటఁ జేర్పవలయునని సంకల్పము గలిగియున్నచో మీరు కొనినవెల కిబ్బడియిత్తును మీయొద్దనున్న వింతశకుంతము మా యొద్ద కనుపుఁడని మీకు వ్రాయుటకు సాహసించుచున్నాను. క్షమించవలయును.

ఇట్లు పుళిందచక్రవర్తి

అని వ్రాసి యాపణిథుల కిచ్చి యంపెను. ఆ భృత్యులు సత్వరముగా మహేంద్రనగరంబున కరిగి పత్రికతో నాపతత్రముల నెల్లఁ గల్పలత యంతఃపురమున కనిపిరి.

రాజపుత్రిక యాపతత్రముల నెల్లఁ దిలకించి కొన్నిటిం బలికించి సంతసించుచుఁ దరువాత రాజునకుఁ బుళిందుఁడు వ్రాసిన యుత్తరముఁ జదివికొని మనసు దిగ్గుమన నొక్కింత యలోచించి చెంతనున్న యశోకపతి కిట్లనియె.

నెచ్చలీ! వింటివా! పుళిందునియింట నాపక్షి యున్నదఁటకాని వానిబిడ్డలు దాని నమ్మనిచ్చిరి కారఁట. ఎదురు మనపతంగమునే కొనియెదరట. అగునగును