పుట:కాశీమజిలీకథలు -09.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

నిట్లే జరుగుననువారును, తలయొక మాటయుఁ బలుకకఁ జొచ్చిరి. ఆ పాటలగంధి యేమాటయు వినిపించుకొనక మెఱపుతీఁగె జలదమం దంతర్థానమైనట్లు నా మెడలో దండవైచిన యాక్షణమ శిబిక యొక్క యంతఃపురంబున కరిగినది.

ఆ వెంటనే యావాల్గంటి చెలికత్తియలు మొత్తములుగా వచ్చి నా కనేకోపచారములు గావింపుచు నాకాంతామణి శుద్ధాంతమునకుఁ దీసికొనిపోయిరి. వయస్యా! నాకం దాసుందరులు గావించిన విందులు ముచ్చటలు వినోదములు కేళీసౌధంబున నేనా నాళీకవదనతోఁ గలసి మెలసి గావించిన క్రీడావిశేషములు క్రమంబునఁ జెప్పినఁ పదిదినములు పట్టును. ఇప్పుడు ప్రొద్దు చాలదు. వేఱొకప్పుడు చెప్పెదంగాక తరువాయి వినుము.

ఆ దనుజభర్త తనకూఁతురు నన్ను భర్తగా వరించినదని విని నే నెవ్వఁడనో తెలిసికొను తలంపుతో నాయున్న యునికి కరుదెంచి యర్చితుండై యిట్లనియె. సౌమ్యుఁడ! నిన్నుఁజూడ వేల్పువు కానట్లు తెల్లమగుచున్నది. నీవు మనుష్యుఁడవు. ఈ దేవలోకంబున కెట్లు వచ్చితివి? తపఃప్రభావముననా? వరప్రభావముననా? నీ యాకారవిశేష మాభిజాత్యము సూచింపుచున్నది. నీవు నా కిప్పు డల్లుఁడవైతివి. కావున వెరవుడిగి నిజము దెలుపుమని యడిగిన నేను నమస్కరింపుచు నిట్లంటిని.

దానవోత్తమా! మీకడఁ గూడ యదార్థముఁజెప్పక మానుదునా? వినుఁడు. నేను భూలోకచక్రవర్తియగు నింద్రమిత్రుని కుమారుండ. జగన్మోహనుఁడనువాఁడ. నాకుఁ జిన్నతనము నుండియు నక్షత్రములన నెట్లుండునో తెలిసికొన నభిలాష గలిగియుండెను. సిద్ధవ్రతుడను సన్యాసిమూలమున నిల్లు వదలి కాశీగంగ దాటుచు నీటిలోఁ బడిపోయి నీటిలో జపము జేయుచున్న యొక సిద్ధుని యనుగ్రహమున నట్టిశక్తి సంపాదించి తేజోలోకముఁ జేరి యందు మూఁడుదినములు తీర్థశుల్కతోఁ గ్రీడించి యటం గదలి తపోలోకమునకుఁ దీర్థశుల్క వెంటరాఁబోయి యందు దివ్యపురుషుఁడై సుఖించుచున్న సిద్దవ్రతుం గలిసికొని మాటాడి భూలోకమునకుఁ బోవు నుపాయముఁ దెలియక యింద్రునికి వెఱచి మీలోకమునకు వచ్చితిని. దారిలో నలువురు రాక్షసులు మిత్రుల వలె వచ్చి నాభార్య నెత్తికొనిపోయిరి. ఆవార్త మీకెఱింగింప వలయునని వచ్చి మీ కుమార్తెచే వరింపఁబడితినని నా వృత్తాంత మింతయేని కొఱతఁ బుచ్చక యంతయుం జెప్పితిని.

నా యుదంత మంతయు విని యాతండు ముక్కుపై వ్రేలిడికొనుచు నీ నాటకమునకు సూత్రధారుఁడవు నీవా? బాబూ? తప్పొకరుచేయ నపరాధము రక్కసులపై బడినది. కానిమ్ము; ఎట్లయినను నాలోకమున నిట్టిదురంతచర్య జరుగుట యపకీర్తి హేతువు. అని పలుకుచుండఁగనే ద్వారపాలకులు వచ్చి దేవా! నమస్కారం. రసాతలవాసులగు నసురులు నలువురు తీర్థశుల్క నెత్తికొని పోవుచుండ దారిఁగాచి దేవదూతలు వారిం బట్టుకొని కట్టి తీర్థశుల్కతోగూడ నిక్కడికి దీసికొనివచ్చిరి. ద్వార