పుట:కాశీమజిలీకథలు -09.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

150

కాశీమజిలీ కథలు - తొమ్మిదవ భాగము

చిన నేను గాపాడెదనులే యని పలికిన నతండు కానిండు. అట్లైన లెస్సయేకదా! అడిగివచ్చినం దప్పేమి యున్నది. పోయివచ్చెదనని చెప్పి యప్పుడే వాఁడు స్వర్గమునకు నిర్గమించెను. నేనపుడు మనసులో దిగులుదోప నాపరివార మంతయుం బొమ్మని యంతఃపురమునకుఁబోయి తల్పంబునం బండుకొని యిట్లు ధ్యానించితిని. మహేంద్రుఁడు మూఁడులోకముల కధికారి అతనియాయుధము దంబోళి. కొండలనైన వ్రక్కలు సేయఁగలదు. వానికోపమునకు నేనెంతవాఁడ? నాయొద్ద నేమిశక్తియున్నది? ఆ సిద్ధునకు నాయందనుగ్రహము గలుగుటచే నిట్టియోషధి నిచ్చెను. దానంజేసి యిందు రాఁగలిగితిని. మహాపుణ్యాత్ములకుగాని నీలోకము జేరశక్యమా? నాకపట మింద్రుని కడ సాగునా? అతండు వచ్చులోపలనే పారిపోవుట లెస్సయని యాలోచించుచుండ నాతీర్థశుల్క యరుదెంచి మనోహరా? చిన్నబోయి యున్నా రేమి? ఏదియో ధ్యానించు చున్నారు నాకెఱింగింపరాని రహస్యమా? ఏమని యడిగిన నేనిట్లంటిని.

ప్రేయసీ! నీయొద్ద దాచనేల? నాభోగమైనది. నేనెందేనిం బోయెద. నీకుఁ గ్రొత్తమగఁడు వచ్చుచున్నాఁడు. నేనందరివంటిదానగాను. మీఱే నాకు భర్తలు ఆ రహస్యమెప్పుడో చెప్పెద నంటివి. ఇప్పుడు సమయము వచ్చినది. నేను మీయూరు విడిచి పోవుచున్నాను నాతో వత్తువా? ఇందే యుండెదవా? అని యడిగిన నప్పడఁతి యిట్లనియె. ప్రాణేశ్వరా! నేనన్నమాట తప్పుదానను గాను. నాకు మీతోడిదగతి. మీ రెక్కడికిఁబోయిన నక్కడికి వత్తు. బదుఁడు అందలి కారణంబు వినుండు. నేనెవ్వతె ననుకొంటిరి? అల్లనాఁడు మీరూపములను మోహించి బైరాగి శుశ్రూష నెపంబున మీవెంటఁ బడిన కపిలను. రెడ్డికోడలను. తెలిసినదా? యోడ మునిఁగి గంగలోఁ బడినప్పుడు విశ్వనాథుని హృదయంబున నిల్పి మహాత్మా! నాకేకోరికయును లేదు. ఏ జన్మమందైన నెప్పటికైన నా జగన్మోహనునే నాకు భర్తగాఁ జేయుము. ఇదియే నా కడపటి యభిలాష యని ధ్యానించుచుఁ బ్రాణములు విడిచితిని.

ఆహా! గంగామహాత్మ్య మేమని వర్ణింతును మఱికొంతసేపటికి కన్నులం దెరచిచూడ నీదివ్యదేహము ధరించియుంటిని ఇరువురు పురుషలు నన్నొక విమానముపై గూర్చుండఁబెట్టి స్వర్గలోకమునకుఁ దీసికొనిపోయి మహేంద్రుని యెదురనిలువం బెట్టిరి. ఇది యెవ్వతె? ఏమిపుణ్యము జేసినది? అని యడిగిన వారు దేవా! ఇది యొక రెడ్డికోడలు. పరపురుషుని మోహించి భర్తను విడిచి వానివెంటఁబడి కాశీపురంబున కరుగుచు రేవు దాటునప్పుడు గంగలోఁ బడి విశ్వేశ్వరుని ధ్యానించుచుఁ బ్రాణము విడిచినది. తత్సుకృతంబున దీని కప్సరోజన్మము వచ్చినది. ఈమె నేలోకమందుండమందురో సెలవిండని యడిగిన నా మహేంద్రుఁ డించుక యాలోచించి స్మృతి నభినయించుచు నౌను జ్ఞాపకమువచ్చినది. తేజోలోకమందున్న తీర్థశుల్కకుఁ గొన్ని నెలలు సెలవిచ్చితిమి అది వచ్చు దనుక దీని కయ్యధికార మిచ్చితిమి. కాశీనగరోపకంఠమున గంగాగర్భంబున విశ్వనాథుని ధ్యానించుచు మృతినొందుట యనేకజనన సుకృత పరి