పుట:కాశీమజిలీకథలు -07.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశోకవనము కథ

93

ఏకకర్ణ - అట్ల యిన మనము సమాన ప్రాయమువారమే ఛీ రామ ఛీ రామ!

ఏకాక్షి - ఏకాలమందైన రాక్షసస్త్రీలకిట్టి నిర్భంధము గల్గినదా? కట్టా ? యీ పాడుతావళములు త్రిప్పలేక వ్రేళిలు గంటులు వారుచున్నవి. ఈపాడు రామమంత్ర మెన్ని నాళ్ళిట్లు జపముచేయుచుందుము. దీర్ఘాయువుగలుగుటఁ గష్టములకుఁ గారణమై నదిగదా.

దీర్ఘ జిహ్విక - మనశత్రువగు వానినామమిట్లు జపించుమని విభీషణుఁడు దిక్కులేనివారలమగుట మనకు నియమించెను. అన్నన్నా! రాక్షసస్త్రీలకెట్టి యిడుములు వచ్చినవి. రావణబ్రహ్మ సీతనిచ్చటికిఁ దీసికొని రాకపోయినను మనకీ ముప్పులేక పోవును ఛీ రామ ఛీ రామ.

లంబోదరి - రావణుని కాలములో మనమేవీరభటులమై చటులముగాఁబట్టణ మంతయుఁ దిరుగుచు నెల్లవారిం బెదరింపుచుండువారముగదా. అట్టి మనమిప్పుడీ రండాపుత్రులకు వెరవలసి‌ వచ్చినది ఔరా కాలమహిమ ఛీ రామ ఛీ రామ.

అజాముఖి -- మనపాదములకు సంకెళులు వైపించి యీపాడు రామమందిరము ముంగల గూర్చుండఁబెట్టి రామమంత్రము జపింపమని నియమించిన విభీషణుని పాపమునకు మేరయున్నదా మన యుసురెప్పుడు తగులునో?

వ్యాఘ్రముఖి -- ఆమహారాజు రావణబ్రహ్మకాలములో ననుదినము తినెడి మాంసము దలచుకొనిన గుండె పగిలిపోవుచున్నది. ఈలంకలో దినమునకుఁ బదిమణుగుల నరమాంసము తినని రక్కసి గలదా? అక్కటా ఎంత యిక్కట్టువచ్చినది. ఛీ రామ ఛీ రామ.

జేష్ట్రసఖీ -- మనకు నరమాంస మాకాశకుసుమమైనది. ఇందు మాంసము దినుటయే దప్పఁట. మునులవలె శాకాహారము తినిన మన కడుపులెట్లు నిండును? మనల నిట్లాకటవేపుచున్న విభీషణుఁడు కొలఁదికాలములో నశింపకుండునా?

పాదచూళిత - అబ్బ! మనుష్యమాంస మనిన నానోరూరుచున్నదిగదా? అన్నా రావణబ్రహ్మ! నీవు మృండవగుటయు మా పాపమేకదా? ఛీ రామ.

లంబకర్ణి - ఈవిభీషణునికి విది చావేల విధింపఁడో తెలియదు పాపీ చిరాయు వను మాట సత్యమే ఛీ రామ ఛీ రామ

హంసిపాదిక - మన ప్రభువును వరించునని బెదరించి విడిచితిమి కాని నాఁడు సీతనుమ్రింగితిమేని నీ వెతగలుగకపోవును భార్యా వియోగదుఃఖంబును రాముండు సమసిన రావణబ్రహ్మకు మరణమేల గలిగెడిని?. అట్లైన మనరాజునకీ విభీషణుండు వరవుండై మెలఁగుచుండును గదా? ఛీ రామ ఛీ రామ.