పుట:కాశీమజిలీకథలు -07.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

260

కాశీమజిలీకథలు - సప్తమభాగము

తండ్రీ! సురస యాజన్మశుద్ధురాలగుట నిక్కువము రూపైకపక్షపాతియగు మదనునిచే మోసపెట్టఁబడి యకార్యమునకుఁ బూనుకొన్నది. బ్రత్యక్షసాక్ష్యంబేమియు లేకపోవుటచేత నానాతిని శిక్షించుటకువీలులేదు అల్పుఁడీపనితాను జేయలేదనక చేసినట్లే యొప్పుచున్నాఁడు. సురసను శిక్షింపనిశ్చయించితివేని నీవుజూచిన విషయములు సాక్ష్యమిచ్చి చక్రవర్తి సూర్యవర్మచేతశిక్షింపఁ జేయుమునీకధికారములేదు. కావున నంతయేలవచ్చెనాఁడుది కావున మన్నించితినని విడిచిపెట్టుము ఇదియొండునాకుఁ బ్రియంబు మఱియు నల్పుఁడమరకల్పుండు కారణాంతరమున నట్టి పేరు పెట్టికొనెను గాని సొమాన్యుఁడుకాఁడు ఉత్తమకులుఁడు అట్టి సుగుణమణిని మీరు గౌరవింపఁ దలంచిరేని మీరాజ్యమున కధినాధుంజేయుటతప్ప వేరొక కార్యంబతనికి గౌరవము కాదు. ఇదియే నారెండవకోరిక ఇంతకన్న నాకేకోరికయు లేదని చెప్పినవిని యాజన పతి యమున బుద్ధిచాతుర్యము స్తుతియించుచు జిఱునగవుతో నిట్లనియె.

పుత్రీ! నీవాక్యనైపుణ్యము స్తోత్రపాత్రమైయున్నది. నీకోరికకడు నుత్తమముగా నున్నది. అట్లే కావించెద నప్పటినుండియు నిదియె నామనస్సులో నున్నది అని పలికి యమునకోరికయుఁ దనసంకల్పము నొక్కటియె యగుట యప్పుడే కొల్వు కూటంబునకుం బోయి యాయభియోగ సంబంధులనెల్ల బిలిపించెను.

అప్పుడు అగ్నివర్మ ఱేనియెదుటకు వచ్చి మహారాజా! నీవుపక్షపాతముజేయు చున్నావు. అల్పుఁడు తప్పులుపై తప్పులుజేయుచున్నాడు బందీగృహంబుననున్నతరి నొంటరిగా నుండుట తిలకించి గవాక్షము తలుపు తెఱచుకొని సురస నెట్టిమాటలాడెనో మీరా పురుషులనడుగుడు వేరే మాకు సాక్ష్యమక్కురలేదు. అని చెప్పిన విని రాజు అక్కడికిఁ బోయిన రాజపురుషుల రప్పించి మీరేమిజూచితిరని అడిగెను. వాండ్రు దేవా! మేమేమియుం జూడలేదు. తలుపు తెరచునప్పటికి నీచిన్నది వెక్కి వెక్కి యేడ్చు చున్నది. యేమని తండ్రి యడిగిన వాతాయనము తెరచి అల్పుఁడు తన్ను మరల నిర్భంధించెనని చెప్పినది. ఇదియ యామెరింగించినది. అని చెప్పిన విని అగ్మివర్మ వింటిరిగద అల్పుని దౌర్జన్య మనవుఁడు రాజు పక్కున నవ్వుచు నిట్లనియె.

విప్రోత్తమా ! అల్పుఁడు సురసను గవాక్షము తెరచి నిర్భంధింపఁ జూచినవారు లేరు. ఆమెచెప్పినమాట నమ్మవలయుననియా మీ అభిప్రాయము అని అడిగిన నగ్ని వర్మ సందియమేలా? నాపుత్రిక అనసూయవంటిది. దబ్బరలాడునదికాదు. అదికూడ నల్పునే అడిగి చూడుఁడు అనుటయు రాజు అల్పునింజూచి అయ్యా! మొన్న బందీ గృహం౦బుననుండఁ గవాక్షముతెరచి మీరామెనునిర్బంధించిరఁటసత్యమే? అనిఅడిగెను.

అంతయు సత్యమే అని అతండుత్తరము జెప్పెను. చూచితిరా! మీరేమో