పుట:కాశీమజిలీకథలు -04.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

భా - ఆపత్రిక యెవ్వరు వ్రాసినదో?

భ - లవంగి యావీరునికి స్వయముగా వ్రాసినది.

భా - ఏమనివ్రాసినదో అయ్యో? ఎంతమోసము?

భ - పెద్దబిబ్బీ యాయుత్తరము నాకుఁ జూపినది. వినుము "ప్రాణేశ్వరా! నీసంస్పర్శసుఖమించుక చవిచూపి యరిగితివి. భవదీయ విరహతాపం బెట్లు భరింపఁగలదానను. నాకది కలలో వార్తవలె నున్నది. తండ్రిని జెఱబెట్టినందుల కించుకయును విచారములేదు. పౌరుషమే చేసితిరి. దానికి నేనేమియు నలుగను. మఱల నొకసారి దర్శనమిమ్ము . నీయథరామృతముగ్రోలి ప్రాణంబుల నిలువ బెట్టి కొనియెదను. నేను నిన్నే త్రికరణములచే బతిగా వరించితిని. నీయుపేక్ష మదీయజీవితాంతము నకుఁ గారణమగును. ఇట్లు భవత్పాదసేవకురాలు, లవంగి" అని యున్నది. ఆ యుత్తరము చూచినంతఁ జక్రవర్తికి గోపమురాదా?

భా - కోప మేమిటికి రావలయును. అందు లవంగి తప్పేమి యున్నది. గాంధర్వవివాహవిధి నది యతని వరించినది. శకుంతల దుష్యంతునినెట్లు వరించినది. కణ్వమహర్షి ధర్మజ్ఞుఁడు కాడాయేమి ?

భ - తురకలకంత శాంతముండునా ? అదియునుం గాక తండ్రిని మత్తుమందుజల్లి చెఱఁబెట్టించి యది దేవతామహిమ యనియు స్వప్నమనియు మోసము చేసిన దఁట. ఆ వృత్తాంతమంతయు నాకు బెద్దబిబ్బీ చెప్పినది.

భా - అయ్యో? ఆ వీరుఁడెవడు ? దాని నందేయుంచుకొనక యిచ్చటి కేమిటికిఁ బంపవలయును. తల్లి మీతో నేమి చెప్పినది.

భ - నేనామె యొద్దకుం బోవువఱకు మహాశోకసాగరములో మునిగిఁ యున్నది. పాదుషా పుత్రికచేసిన చర్యలన్నియు భార్యకుంజెప్పి గర్భవతియగు నా నీచురాలిం జంపి యపకీర్తిఁ బాపుకొందునని నుడివెనట.

భా - అయ్యో? ఆ యర్భకురాలు గర్భవతి యయ్యెనా ? తరువాత.

భ - అదియేకదా మొదటిముప్పు. ఆ మాటవిని బిబ్బీ మగనిఁ బెక్కుగతులఁ బ్రార్దించినది కాని యతనికి దయవచ్చినదికాదు.

భా - క్రూరుల హృదయములు మృదువులుకావు. తరువాత ?

భ - ఫాదషా యీ రహస్య మొరులకుఁ దెలియకుండఁ జేయవలయునని గూడముగా నుద్యానవనములో నుండగాఁ బుత్రికం జంపింతునని భార్యకుం జెప్పెను. కావున నా పట్టమహిషి నన్నుఁ బిలిపించి యా వార్త లవంగికిం జెప్పి యెక్కడికేనిం బాఱిపోవునట్లు చేయుమన్నది. కన్నమోహ మట్లుండునుకదా?

భా -- -బాధ నాదికాని యామెదికాదు. మంచి యుపాయమే యోచించినది. అట్లేల చేయకపోతిరి ?