పుట:కాశీమజిలీకథలు -04.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

సులోచన - విద్యయొక్కటియే ! దయాదాక్షిణ్యాది గుణంబులెన్ని యేనిఁ గలవు. వీఁడు కనికరించి యా సన్యాసినిఁ జంపక విడిచెను. కానిచో మా దేవితోఁ గూడ మే మీపాటికి వీనికిఁ బరిచారికలమై యుండవలసివచ్చును.

చంద్ర - సిరిరా మోకాలొడ్డువాఁ డుండునా ?

సులో - అట్లే చేసెను. ఉత్తమ బ్రాహ్మణ హృదయంబు వెన్న వంటిది గదా !

విద్యున్మాల - వీని మంచిలక్షణములఁ బరిశీలించియే కాఁబోలు మా దేవి రాజపుత్రిక నడవిపాలుచేసి వీని నీయక్షిణీ శైలమునకు దీసికొని వచ్చినది.

చంద్ర - రాజపుత్రిక నేమిటికి నడవిపాలు సేసినది ?

విద్యు - దానికిని నా మాంత్రికుని శాసనమే కారణము.

సులోచన – వీనికి సామ్రాజ్య సౌఖ్యము గలుగునట్లు మనము దీవింప వలయు.

చంద్ర - ఈ పుణ్యాత్ముండు పట్టభద్రుండగుగాక !

విద్య - ఈ సుకృతిఁ దప్పక వర్ధిల్లుఁగాక !

అని మాట్లాడికొనుచు నంతలోఁ దెల్లవారు సమయమగుచున్నది కావున వారెల్ల నిష్క్రమించిరి. ఆ మాట లన్నియును విని వసుంధరుఁడు రాజపత్ని యే తన ప్రవాసమునకు హేతువని తెలిసికొనియు నామెయం దించుకయు నలుగక యుదయంబున లేచి యా దేవతలకు నమస్కరించి సరస్సు కరిగి స్నానముజేసి చేతులు జోడించి 'తల్లీ : యక్షిణీ : నే నీ పర్వతము దిగి యరుగునప్పుడు క్రూరమృగబాధ గలుగకుండ ననుగ్రహింపుము నిష్కంటకమైన దారిఁజూపు' మని ప్రార్థించి నడువ దొడంగెను.

అప్పు డతనికి నిరువంకలఁ గుసుమ కిసలయఫలదళమనోహరములగు తరులతా గుల్మములచే నలంకరింపబడిన సోపానమార్గ మొండుగనంబడినది. అది యక్షిణీ ప్రభావమని సంతసించుచు నతం డాగిరి నశ్రమంబున దిగెను. తత్పాదంబుల మూఁడు దెసల సముద్రము, నొక దెస తామ్రపర్ణీనదియు నావరింపబడి యున్నది. వానిం దాటుట యెట్లని తలంచుచున్నంతలోఁ గొందఱు నావికు లొకయోడం దీసికొని యా తీరమున కరుదెంచి వాని నా కలముపై నెక్కించికొని యవ్వలి రేవునదింపి పోయిరి వసుంధరుఁ డా తీరమునఁ దిగి యందుఁగల జనపదంబులమీఁదుగా బ్రయాణము గావించెనని యెఱింగించి మణిసిద్ధుం డవ్వలి వృత్తాంతము తరువాత మజిలీయం దిట్లని చెప్పదొడంగెను.