పుట:కాశీమజిలీకథలు -04.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యక్షిణిదేవి కథ

301

అవసరమయినతరిఁ దలంచికొనుము. కార్యసాఫల్యము గావించెదని మఱల నాయతను ధ్వని వినంబడినది.

మహాప్రసాదమని యవ్వాక్యంబు శిరంబునం గైకొని యతండు. "దయా విహీనుండవై మహర్షులవోలె జటలనేమిటికి దాలిచెదవు ? నీవు చండాలుండవని" పలికి యా కత్తిచే వానిజడలం గోసి విడిచిపెట్టెను. ఆ సన్యాసి మృత్యుముఖమునుండి బయలుపడి లేచి మారుమాట పలుకక తలవంచుకొని తనయింటికిం బోయెను.

సామ్రాజ్యపదంబు లభించుచుండ లెక్క. సేయక తన్నుఁ జంపబూనిన వానిని విడిచిపెట్టిన యా బాలకుని దయాళుత్వము వేనోళ్ళం గొనియాడఁదగి యున్నది గదా ? అట్లు సన్యాసి లజ్జావసతముఖుండై యరిగిన వెనుక పసుంధరుఁ డెక్కడికిని బోక యందేయుండి మధ్యాహ్నము ఫలములం దిని రాత్రి యా మంటపములోఁ బండుకొని క్రూరమృగంబులవలన భయంబునంజేసి నిద్రఁబోవక యెద్దియో ధ్యానించు చుండెను. అర్ధరాత్రమైనంత నతని చెవులకు మనోహరమైన గానము వినంబడినది. ఆ సంగీతము విని యతం డదరిపడిలేచి యోహో యీ విజనారణ్యమున నిట్టి సంగీతము పాడువా రెవ్వరోకదా ! యని నాలుగుదెసలు పరికింప యక్షిణీదేవత గర్భాలయములో నా వినోదము జరుగుచున్నట్లు తెలియఁబడినది.

అప్పుడతండు మెల్లన లోనికిఁబోయి యొక విగ్రహముచాటున నడఁగి చూచుచుండెను. దివ్యమాణిక్య విభూషాంబరశోభితలై యక్షకన్యలు పెక్కండ్రా యంతర్బవనమంతయు విధూషణమణీ ప్రభాధగద్ధగితములగు దేహకాంతులచే మెఱయఁజేయుచు నా దేవతా విగ్రహముచుట్టునుం గూర్చుండి వీణాతంత్రీస్వరముతో మేళగించి కొందఱు గాంధర్వంబు వెలియింప గొందఱు నృత్యములు సేయుచుఁ బెద్దతడ వమ్మహాదేవి నారాధించిరి. కొంతసేపు వినోదకధాసల్లాప విశేషములఁ గాలక్షేపము గావించిరి. ఆ ప్రసంగములోఁ జంద్రరేఖయను యక్షకన్యక-

సఖులారా ! మనము వచ్చునప్పుడా ముఖమంటములో నెవ్వఁడో పండుకొని నిద్రపోవుచున్నాఁడు చూచితిరా ? వాని సౌందర్య మర్కజముగా నున్నది సుఁడీ !

విద్యున్మాల - వాఁడు మందారవల్లి కొడుకు. వసుంధరుఁడను వాఁడు. అస్మద్దేవతయే వాని నీగిరిశిఖరమునకుఁ దీసికొనివచ్చి పడవైచినది .

చంద్రలేఖ – ఏమిటికట్లు పడవేయవలసి వచ్చినది ?

విద్యు – సోమశేఖరుఁడను బ్రాహ్మణునిచే మంత్రబద్దయై తదాజ్ఞానుసార మట్లు చేసినది. వీని విద్యచూచి రాజపత్ని యోర్వలేక యట్లు చేయించినదఁట.

చంద్ర – వీనికి రూపానుగుణ్యమైన విద్యకూడ నున్నదియా ?