పుట:కాశీమజిలీకథలు -04.pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

మీయొద్ద కనిపెద వానికి కాకితముపై వ్రాసియియ్యుఁడని యా విధానమంతయుం జెప్పుటయు నా కొమ్మ సమ్మతించి యా ద్రవ్య మప్పుడే యా విప్రుని వెంట వారింటి కనిపినది. మగనిం జంపఁబూనిన సాహసురాలి కా విప్రకుమారునిం జంప యత్నించు టొక యబ్బురమా !

ఆ విప్రుండును మఱునాఁడు దీక్షవహించి రహస్యగృహంబునం గూర్చుండి యక్షిణీ మంత్రము జపించుచు హోమముగావించి బ్రాహ్మణ సంతర్పణము జేయుచుఁ బూర్ణాహుతిసేయు దివసంబు రాత్రి ధండుండను తన శిష్యుంజేరి యోరీ ? నీ వీ రేయి గళానిలయ యంతఃపురంబున కరిగి యీ యుత్తరంబిమ్ము. నీకొక పేరుగల కాకితం బిచ్చును. దాని రహస్యముగా దీసికొనిరమ్ము. నడుమ బ్రహ్మకైనం జూప రాదు సుమీ యని బోధించి పంపిన వాఁడట్లు చని కళానిలయకుఁ దనగురు డిచ్చిన యుత్తరమిచ్చుటయుం జదువుకొని పరమ సంతోషముతో నా యోషామణి పల్లవికతో నాలోచించి యంతకుముందు మందారవల్లి కొడుకు వసుంధరుఁడు అని యొక కాకితముపై వ్రాసి మడిచి యుంచినది. కావున నది యాయంతే వాసికిచ్చి భద్రమని చెప్పి యంపినది.

ఆ ధండుండల్లన రక్ష్యాంతరంబులు గడిచివచ్చుచు సింహద్వార ప్రాంత మందలి వినోద సభాంతరమున వారకాంత లత్యంత మనోహరముగా నృత్యంబు సేయుచుండుటయు నొక్కింత సేపందుఁ గూర్చుండి యా వింతలం జూచుచుండెను. అప్పుడు గానాయత్తచిత్తుండగు నాధండుని హస్తమునుండి యా కాకితపుమడతయందు జాఱిపడి గాలిచే నవ్వలి కెగిరిపోయినది.

అంతలోఁ దన ప్రమాదమును దెలిసికొని యా శిష్కుండదరిపడుచు జేతం గాకితము గానక యందు నలుమూలలు వెదకఁ దొడంగెను పరిచారకులు పనికిమాలిన కాకితముల పీలికలన్నియుం దుడిచి యందొకచో రాశిగాఁ ద్రోయుచుందురు. ఆ ప్రోగావటుఁడుచూచి యందు దడవి తన కాకితమును వెదకెను. అట్టి కాకితము మడత యొకటి యతని చేతికిం దొరకినది. అదియే యదియనుకొని పరమసంతోషముతో నా వినేయుఁ డతిరయంబున గురునొద్దకుంజని దండన భీతిచే నడుమజరిగిన కతయేమియుం జెప్పక రాజపత్ని యిచ్చినదని యా కాకితము మడత యిచ్చెను

అందుఁ గళానిలయ కూఁతురు కళావతి అనియున్నది. ఆ యొజ్జయందలి వ్యత్యాసము విమర్శింపక యా పేరుచ్చరించుచు యక్షిణీ మంత్రము జపించి యా కళావతిని సంకల్పించిన ప్రకారము దూరదేశ కాంతారములోఁ బడవేయుమని కోరుచు నా నిశావ సానముతో హోమావసానము గావించెను.

ఆ మాంత్రికుండు కార్యసిద్ధియైనట్లు పొడగట్టుటయుఁ దనకెక్కుడు ద్రవ్యము దొరుకునని మిగుల సంతసించుచు మఱునాఁడుదయంబున నక్షతలంగైకొని కళానిలయ యంతఃపురంబున కరిగినప్పుడు