పుట:కాశీమజిలీకథలు -04.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

నరసి - (వచ్చి) యెక్కడ ? బాబూ ! యెక్కడ ?

సెట్టి - కడుపుమీఁదురా ! బాబో : గుండెలలో కెక్కి నదిరా !

నరసి – అయ్యో : అయ్యో : కడుపుమీఁదనే ! ఏదీ అగ్గిపెట్టి (అని పుచ్చుకొని పుల్ల రాచి వెలిగించి) అమ్మయ్యో ! మండ్రగబ్బండో.

సెట్టి - మండ్రగబ్బే : చచ్చిపోతానురో.

నరసి - భయములేదు. నల్ల దిలెండి. వచ్చినవేళ మంచిదికాదు. బాబూ ! ఇంటిఁ బోదామూ ?

సెట్టి – అయ్యో : యేలా రానురా : ఆ చిన్నది వస్తున్నది. యేలాగో బిగ్గపట్టుకొని వుంటాను. కాని నీ వింటికిఁబోయి నా పెట్టిలో తేలుచెక్క యున్నది. తీసికొనిరా.

చిత్తముబాబూ ! (అని తాళముచెవి తీసికొనివాఁడు నిష్క్రమించుచున్నాఁడు. అంతలో అప్పివచ్చి మెల్లగా

అప్పి- శెట్టిగారూ : ఆమె వస్తున్నది. జాగ్రత్త.

సెట్టి - అప్పేవు ! నాపని అయినది. మండ్రగబ్బ పొత్తికడుపు క్రింది కుట్టినది. గుండెలో బరువెక్కువై నది. దానియందుఁగల మక్కువచే నట్లంటిని కాని దొర్ల వలసినంత బాధపెట్టుచున్నది. అయ్యబాబో : (అని యరచుచుండెను)

అప్పి - (స్వ)పోనీ యీదినమునకు దాటినదికదా ! ఈ బొజ్జకనకయ్యను జూచి యాచిన్నది మట్లాడునా ? అదియునుగాక ఆమె మంచిగుణవంతురాలు. కానిమ్ము . రేపు నాబహుమతి లాగికొనిమరీ పనిచేస్తాను. (ప్ర) ఆలాగునా ? అయ్యో ? మంచి విఘ్న మే వచ్చిందే ? పోనీయండి యీవేళ వూరికే చూడండి ఎల్లుండి మళ్ళా తీసికొనివస్తాను.

సెట్టి - అందుకోసరమే యింటికిఁ బోవుచున్నాను. ఆ చిన్నదాన్ని దలంచుకొనుచుండ నాబాధ కనంబడుచుండలేదు.

దప్పి - ఏమి మూల్గకండీ. (అని ముందుకుపోయి) అమ్మాగారూ ఈలాగునరండీ. ఇదే అమ్మవారిగుడి.

మహిళ - అప్పీ ! అమ్మవారికిఁ బ్రదక్షిణముజేసి వత్తమురమ్ము (అని దానితో గుడి తిరిగివచ్చి ముఖమండపములోఁ బ్రవేశించి) తలుపులు వేయఁబడియున్న వా యేమి ?

అప్పి - తలుపులువేసి యర్చకుఁడింటికిం బోవును. రాత్రి యిక్కడ నుండియే నై వేద్యములు పెట్టుదురు. మీరును అట్టె జేయుఁడు.

మహిళ - (దీపము వెలిగించి హారతులిచ్చి యుపహారముల నైవేద్యము పెట్టి చేతులు జోడించి)