పుట:కాశీమజిలీకథలు -04.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లలిత కథ

221

చెప్పుము. చెప్పకున్న నీ నంగడం బంతయు నాశనము నొందింతుఁ జూడుమనుటయు గడగడ వడంకుచుఁ జేతులు జోడించి వాడిట్ల నియె.

స్వామీ! నేను దేవరయెదుట వాస్తవము మనవి చేయుచున్నాను. వాఁడు నాకుఁ గడుపునఁ బుట్టిన కొడుకుగాడు. వినుండు. నే నొకనాఁడు రాత్రి గంగలోఁ బెద్ద వలఁబన్ని మఱునాఁ డుదయ కాలంబున నా జాలంబు లాగి యందుఁ జిక్కి,న యాదఃప్రకరంబులఁ దీరసికతా తలంబున దులుపుచుండ నా వలనుండి యీ బాలుండు నేలంబడియెను. అప్పటి కాశిశువునకు నాలుగేడుల ప్రాయముగలిగి యున్నది. అక్కజమగు తేజముతోఁ బ్రకాశింపుచున్న యా పాపనిఁ జూచి విస్మయము జెందుచు బిడ్డలు లేని వాఁడినగుట గంగాదేవియే దయఁజేసినదని సంతసించి వాని నింటికిం దీసికొని పోయి పెంచుకొంటిని. ఈ రహస్య మెవ్వరికిని దెలుపక వాఁడు నాకడుపునఁ బుట్టిన వాఁడే యని చెప్పుచుందును. మా కులమువారెల్ల వాఁడు గంగాదత్తుడని యెఱుంగుదురు. దేవర విచారింపవచ్చును. మఱియు వెనుకటిరీతిగా రెండవ కడియము నాకు దొరికినది. దానిం దేవరకిచ్చిరమ్మని నిన్నఁ బంపితిని. వాఁడు కొల్వుకూటమునకు వచ్చి యది వివిక్తముగా నుండుటకు శంకించుచు నలుమూలలు సూచుచుండ భర్తృదారిక దాసి యొకతెవచ్చి యా వలయ వృత్తాంతము విని దానిఁ గైకొని యంతఃపురమున కరిగినట.

అంతలో యువరాజుగారువచ్చి నీవిం దేటికి వచ్చితివిరా ద్రోహుఁడా ? యని తొంటిపలుకుల నుగ్గడింపుచు నదలించిన వాఁడు వచ్చినపని చెప్పినంత నింతింతనరాని కోపముతో నిలు నిలు పోవలదని యంకిలిపెట్టిరట. వాఁ డంతటితో నిలువక త్రోసికొని వచ్చెనఁట. ఇదియే యదార్థమని యింటికి వచ్చి వాఁడు నాఁతోఁ జెప్పెను.

అప్పుడు నేను వాని దిట్టినతిట్లును కొట్టినకొట్లును దేవరతో నేమి మనవి చేసికొందును ? వితర్కించిన దేవరకే విశదముకాక మానదు. వాఁడు నాయదపులకు నిలువలేక నిన్నరాత్రి నాతోఁ జెప్పకయే యెక్కడికో పాఱిపోయెను. ఇంతియ నిక్కువము, నేను దేవర పాదసేవకుండ రక్షింపుఁడని పాదంబులంబడి వేఁడుకొనియెను. అప్పు డా రాజు వితర్కపూర్వకముగా ఏమేమీ ! వాఁడు నీ కౌరసుఁడు కాఁడా ? రెండవ కడియముగూడ నీటిలో దొరికినదా' ఆ! ఆ!ఆ! యని యేదియో ధ్యానించుచు నంతకుమున్ను గలిగిన కోపమంతయు నీరైపోవ బుత్త్రుని మొగంబుఁ జూచి వీని మాటలు వింటిరా ? యదార్థములేనా? యని యడిగిన రాజపుత్త్రుం డిట్లనియె. తండ్రీ ! వీని మాటలన్నియు వట్టి బూటకములు. తనకుఁ బుట్టలేదని మీరు కనికరింతురని యట్లు చెప్పుచున్నాడు. కడియము నెపంబున వాఁ డంతఃపురము దాపునకుంబోయి యాగడముఁ జేసెను అట్టివానిం బోవలదనుట తప్పా ? వాఁడు నన్నుఁ ద్రోసికొని పోయెనేమి ? నా గుండెలోని దెబ్బ పరీక్షింపుఁడు. ఈతేప వానిని విడిచి పెట్టితిరేని