పుట:కాశీమజిలీకథలు -04.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

గౌరవమే వచ్చినది. ఆ కంకణమేది ? వీధినుండి యడుగక లోపలకు పోవుదువా ? యన నతం డాకంకణ మతఃపురమున కొకదాది తీసికొని పోయినదని చెప్పెను.

అప్పుడు నిప్పుద్రొక్కిన కోఁతివలె నెగసిపడుచు, నోరిమొద్దా ! పెద్ద వారలు లేనప్పుడు వచ్చి యంతఃపురమునకు వస్తువులు పం పెదవా ? నిన్నిప్పుడు గట్టింతుఁ జూడుమని పలుకుచు రక్షక పురుషు లెవ్వరిక్కడ రండోయని యఱచెను. అప్పుడు క్రోధోద్దీపితమాససుఁడై పుష్పహాసుడు అల్పబుద్ధులు సామంబున జక్కఁ బడరుఁ “దండమేకార్యమని" తలఁచుచు బిడికిట వాని నొక్కపోటు పొడచి యవ్వలికి దాటిపోయెను. ఆ వ్రేటుతిని రాజనందనుఁడు నేల బడి మూర్చనొందెను. ఇంతలో రాజపురుషులు కొందఱచ్చటికి వచ్చి వానిలేవనెత్తి సేదదీర్చి భర్తృదారకా! నిన్నెవ్వఁ డిట్లు పడవేసెను. ఒక్కండ వీ మాఱుమూలకు రానేల ? మాటాడవేమి ? అయాసము తీరలేదా ? యని యడిగిన నతండు తెరపి తెచ్చుకొని కన్ను లెఱ్ఱజేయుచు చీ ! ఛీ ! యింత పనికిమాలిన కావలివార లెందైనం గలరా రాజులేఁడని నేడు కోటలోని కొక్కడైన రాక యిండ్ల కడ శయనించిరి కాఁబోలు కానిండు. మీ పని ముందుఁ బట్టింతు. ఇట్టి బహిరంగ స్థలంబున బట్టబగలు వచ్చి యొక చెడుగు పిడుగుపడినట్లు పిలికిటఁ బొడిచి పాఱిపోయిన నొక్కరైన నడ్డగించకపోయిరే. ప్రాణములు పోయిన తరువాత వచ్చి యేమి చేయుదురు ? అబ్బా ! నాకీ నొప్పి యెన్ని దినంబులకుఁ బోవును. యావజ్జీవము గుండెలలో బాధించుచుందునే ? అయ్యో ? యేమి చేయుదునని విచారింపుచున్న, రాజపురుషు లిట్ల నిరి.

అయ్యా ! యిది సంధ్యకాల మగుటచే భోజనంబునకై కావలివార లిండ్ల కు పోయిరి. అంతియ కాని మఱియొకటి కాదు. మిమ్మట్లు గొట్టిన మూర్ఖునిం బేర్కొనుఁడు. ఇప్పుడేపోయి వానింబట్టి చెఱసాల బెట్టింతుము. కాలసర్పమును గాలఁదన్ని బ్రతుకఁ దలంచినవాఁ డుండనే యని పలికిన నతండు “వినుండు ఆ మొండికట్టె పల్లిబికారి తొత్తుకొడుకు శుద్దాంత నిశాంతాంతరమునకుం జొరనిచ్చితిని కానని నన్నిట్లు చేసి బాఱిపోయెను. మీకు సామర్థ్యము గలిగియుండిన నా స్వామిద్రోహిం బట్టుకొని చెఱసాలఁ బెట్టుఁడని నుడివిన వాండ్రు తెలియని మిమ్ముఁ గొట్టినట్టి పల్లె వాఁడీవీట నెవ్వఁడున్నాఁడు. విప్పి చెప్పుఁ డనుటయు తనసాటివా డెవఁడును లేఁడని గరువము గలిగి యెగసిపాటుతో మా గుర్రము లెక్కి తిరిగెను గుఱ్ఱపుకాసువాఁడు పుష్పహాసుని మీ రెఱుఁగరా ? యని పలికిన వార లఱుతఁ జేతులు వైచికొని అమ్మకచెల్లా ! వాఁడా? వాఁడుమీకుఁజెలికాఁడు కాఁడా? వానిం బట్టుకొనుట కష్టము. వాఁడెదిరించిన వేగురం గొట్టఁగలఁడు. అందుల కెక్కుడు సన్నాహము కావలయునని చెప్పిరి. అంతలో రాజపుత్రుఁ ------ నొప్పి ప్రబలుటచే నంతఃపురమునకుఁ గొనిపోఁబడెను. శత్రువును వంచించుట కిధియే సమయమని బాధ యలఁతిగా నున్నను నా రాజపుత్రుఁ డపుడే చచ్చు వాడుంబోలె మూల్గఁ దొడంగెను. అప్పుడు