పుట:కాశీమజిలీకథలు -04.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

ఉ. చెక్కులనిగ్గునెన్నుదురు • చెల్వు గనుంగవతీరు మోము మే
    ల్చక్కఁదనంబు జానుగుల • సౌరు భుజంబుల సోయగంబుమై
    చొక్కపుతళ్కు పేరురము • సుందరమెన్న వశంబె ? బ్రహ్మక
    మ్మక్క! యరుంధతీలలన • యైన వరింపదె ? వీని జూచినన్.

అయ్యారే ! వీనిం గాంచనగర్భుఁడు సత్కులసంజాతుం గావించినచొఁ గాంచనంబునకుఁ బరిమళం బిచ్చినట్లుండునుగదా ? యని వెరఁగందుచుఁ దెలకా ! నీవు చెప్పిన యతం డీతండే ? యని యడిగినది సఖీ ! వీని ప్రఖ్యాతి నీవెఱుఁగవు గాఁబోలు మన సుందరకునితోఁ జదువుకొని సకలవిద్యలయం దసమానుండని మొన్న రాజసభలో బిరుదము వహించినాఁడు. మీ యన్నగారే యోడిపోయిరి. ఈతండు గౌరవనీయుఁ డని పలికిన నక్కలికి స్మృతి నభినయించుచు నగు నగు. వింటి నా ప్రఖ్యాతుం డీతండేనా ? యా గద్దియపైఁ గూర్చుండుమనుము. అని మరుశరంబుల కగ్గంబైవడెందముతో వానియందమూరక చూచుచుండెను. పుష్పహాసుండును లోకాతిశయ సౌందర్యంబునఁ బొలుపొందు నయ్యిందువదనంగాంచి పంచశర విద్ధహృదయుండై మోహాతిరేకంబున నొడలెఱుంగక యిట్టెచూచుచుఁ దనచూపులఁ దదీయ విలోకనశృంఖలంబులకుం దగిలికొనఁ జేసెను.

ఇద్దఱు పెద్దతడ విట్లొండొరులఁ గనుంగొనుచుఁ జిత్తరువుల కరణిఁ గదల కుండుటయుం జూచి తిలక పలకరించుచు ననఘా ! నీవీ గద్దియం గూర్చుండుము. నీ కీ శద్ధాంత నిశాంత చిత్రప్రతిమ లంత వింత గలుఁగజేయుచున్నవియా యేమి ? విస్మయముతోఁ జూచుచుంటివని పలికిన నతండు దనచూపుని మఱలించుకొని యా పీఠంబునం గూర్చుండి, లలనా ! యగునగు నే నింతకుముం దింత వింత ప్రతిమలఁ జూచి యెఱుంగ. వీనిసోయగ మప్రతిమానముగదా! యని పలికెను.

అప్పుడు తిలక నాతీ ! కంకణము వానిచేతనుండగనే యబ్బురపడి చూచెద వేల ? చేతికి రాదా ? పిమ్మట సంతతముచూచి ముచ్చటపడవచ్చునులే యని మంద లించిన నచ్చంచలాక్షి తెలిసికొని యేదీ ? యిటులెమ్ము దానిం దాల్చు నుత్సుకత్వ మంత తొందర పెట్టుచున్నదని పలికినది. అప్పుడా కడియమును బుష్పహాసుఁడు తిలక కిచ్చెను. తిలక లలిత కిచ్చినది. లలిత దానిం బుచ్చుకొని మునుపటి కడియము పజ్జనిడి రెండిటికిని భేదము గానక సంతసించుచుఁ దిలకా ! నేఁడుగదా ! నా వేడుక తీరినదిఁ జోడులేక యిది ముచ్చటఁ జేసినది కాదుసుమీ: యని పలికిన ------------ అగు నేడను జోడుగూడినం గాని శోభించదని యుత్తరము చెప్పినది. లలిత దానిం దాల్ప నోపియుఁ జేతగానియట్ల భినయించుచుఁ దిలకను దనచేతఁ బెట్టమని కోరినది. అదియు నీకుఁ గానిది నా కలవడునా ? యని యుత్తరము జెప్పినది.

సకలకళానిపుణుండగు పుష్పహాసుఁడా భాసురగాత్రి ------------ గ్రహించి అయ్యో ? యిప్పుడు నేను మిక్కిలి ప్రమాదమైన పనిఁ గావించితిని.