పుట:కాశీమజిలీకథలు -02.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని కథ

13

శీఘ్రకాలములో మనము వియోగము జెంది పెక్కిడుములం గుడిచి చివర జగద్విఖ్యాతమగు కీర్తియుం బడయునట్ల దానం బొడగట్టెడి నింతకు దైవమేమివ్రాసెనో తెలియదు. కర్మసూత్రంబు దాట నెవ్వనితరము? ఇప్పుడు తదనుగుణ్యముగ నరణ్యగమనము నాకుఁ దటస్తించినది. ఇదియు దైవప్రేరితము కావచ్చును. లేకున్న నిత్యము పెక్కుమృగంబులను జంపి తినుచున్న యక్కిరాతు లొక్కమెకమునకుఁ జిక్కి యిక్కడకు రావలయునా? కానిమ్ము. కానిమ్ము. అని దీర్ఘనిశ్వాసములు నిగుడ్చుచు దీనవదనుండై పలికిన యన్నరనాథుని జూచి వెఱగందుచు నాచంద్రసేన యిట్లనియె.

ఏమేమీ? నా కలలో నంతవంతయున్నదా? కటకటా? యెఱుంగకపోతినే. మీ యంతరంగంబు కలంకపెట్టి యెంత యపరాధినైతిని. అయ్యో! మనకు వియోగము కలుగునంటిరి. ఆమాట విన్నంత నాగుండెలు కొట్టుకొనుచున్నవి. యెట్లు సైరింతునని యతనికంఠము బిగ్గరగాఁ గౌగలించుకొని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది. అప్పుడా రాజపుంగవుండు తెరవా! వెరవకుము. కలలునిజమగునా? యూరక నిన్ను వెరపించుట కట్లంటినిగాని యథార్ధముకాదు. నేను రేపటియుదయంబున వేటకుఁబోయి యస్త్రపాటవంబు దేటపడ నా సింహమును సంహరించి చెచ్చెర వచ్చెద నంతదనుక భద్రముగా నుండుమని యోదార్చిన నక్కలకంఠి కంఠంబు విడువకయే గద్గదకంఠముతో మరల నిట్లనియె.

ప్రాణేశ్వరా! మిమ్మువిడిచి యొంటియై నుండఁజాలను నాకును మీతోడరా ననుజ్ఞయిండు లేకున్న నెప్పుడేనిఁ బోవచ్చు నిప్పటి కప్పయనంబు మానిపింపుఁడని వగచుచున్న యమ్మత్తకాశినిం గ్రుచ్చి యెత్తి కౌఁగలించుకొనుచుఁ జెక్కులు ముద్దాడి తద్దయుం బ్రీతి నానేత ముద్దుగుమ్మా ? ఇప్పుడు వనంబునకుఁ బోవకతప్పదు. అబ్బోయల కభయప్రదానమిచ్చితి. కావున నాతోడ రమ్ము, ఉద్యానవనంబునం బోలె మన మందు విహరింపవచ్చునని మచ్చిక నమ్మచ్చెకంటి యిచ్చగింపఁబలికి తత్కాలోచితకృత్యముల నిర్వర్తించి యారేయి గడపెను.

అంత మరునాఁ డరుణోదయంబున వేటఁబాటవంబుగల మృగయులు పెక్కండ్రు తత్సాధనంబునం బూని పరివేష్టింప సముచితపరివారసహితుండై యయ్యింద్రద్యుమ్నుండు యౌవనరాజ్యపట్టభద్రుఁ డగు విజయుండను కుమారు నింటికడ భద్రముగానుండ నియమించి మంచిముహూర్తమ్మున వెడలి భార్యయెక్కిన శిబికవెంటఁ దన గుఱ్ఱమును నడిపించుచుఁ గతిపయప్రయాణముల శబరనిర్దిష్టమార్గంబున నవ్వింధ్యారణ్యమున కరిగెను. అంతకమున్న యందు నుపవనసౌధములభాతి నతివిచిత్రముగాఁ జిత్రకారకులచే నమర్చఁబడిన పటకుటీరములందు విడిచి చుట్టునుం దనవాహినుల వ్యూహంబున నిలఁబెట్టి కొంతవట్టు పట్టమహిషికందుఁ గన్పట్టు మెట్టలం బెట్టు లుసిరిపట్టుగా నిట్టట్టు గ్రుమ్మరు వింతపిట్టలచేష్టలఁ జూపుచు పరమేష్టి సృష్టి ప్రభావం బగ్గింపుచుండెను.