పుట:కాశీమజిలీకథలు -02.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతపుష్పము కథ

83

నియె. అమ్మా ! నీయందు విశాలాక్షికి మిక్కిలి దయగలదు. నీకవశ్యము జయము గలుగును. మీరు సేనలతో గుహమార్గమునబోయి కోటలో బ్రవేశించి వైరుల సులభముగా గెలువుడు. నేనువచ్చి కడు తడవైనది. కాబట్టి నౌకాయానమున మాయూరికి బోయెదము, అట్లు సమ్మతింపుము. నీవు కాశీపురము వశముజేసికొనిన పిమ్మట మాయూరికొకసారి రావలయు నిదె నాకోరికయని చెప్పిన అప్పడతియు అతని మాటలకు సమ్మతించి శ్రీఘ్రకాలములోనె అట్టియోడను ప్రయాణమునకు సిద్ధపరపించినది.

ఇంద్రద్యుమ్నుని సముద్రప్రయాణము

అంత నింద్రద్యుమ్నుండు మంచిసమయమున విశాలాక్షి యనుమతి వడసి సముచితపరివారము సేవింప భార్యతోగూడ నొకయోడనెక్కి మంచిగాలి విసరుచుండ దెరచాపలెత్తించి రేవు విడిపించెను. అందప్పుడెక్కిన జనమునకు సంవత్సరమునకు సరిపడిన భోజనసామాగ్రి యున్నది. మంచి నేర్పరులగు నావికులచేత నా ప్రవహణము నడుపబడుచుండుట గడువేగముగా మూడువారములు నడచినది. అట్లు నడచుచుండ నొకనాడు సాయంకాలమున గర్ణధారుడు మింటిచిహ్నముల బరీక్షించి గాలివానలక్షణములు గాన్పించుచున్నవని తొందరగా బలుకుచు దెరచాపల దింపి యోడకు లంగరు వైపించెను.

వానిపరీక్ష ఎట్టిదో అంతలోనే గాలి అద్భుతముగా విసరజొచ్చినది. అప్పుడు నావలోని జనులందరు జడియదొడంగిరి. ఓడ సరదారుడు వాండ్రకందరకు ధైర్యము గరపుచు రెండుమూడుదినములు గడపెను. నాలుగవదినమున విసరెడు గాలినిజూచి యిక పడవ నిలువదు. ఎవరి యిష్టదైవముల వారు స్మరించుకొనవలసినదే మరియొక సాధనములేదు. భూమి దాపునలేదు. ఈరాత్రి మిక్కిలి జంఝావాతము విసరును. ఓడ తలక్రిందగునని చెప్పుచు గన్నుల నీరువిడువజొచ్చెను. అప్పుడతని యధైర్యమును జూచి అందున్నవారెల్ల గొల్లుమని యేడువదొడంగినది. ఇంద్రద్యుమ్నమహారాజు వారియలజడి అంతయు నడిపి మరణభీతిచే దొట్రుపడుచు దన్నుగౌగలించుకొను భార్యను దగ్గరదీసి కన్నీరు దుడుచుచు వెఱపుగ వైరాగ్యవాక్యంబుల నిట్లుపన్యసించెను. బోటీ! నీ వేటికి జింతించెదవు. పుట్టినవారి కెప్పటికైనను చావు నిక్కమైయున్నదిగదా! మనకు దైవ మీయుదకమధ్యమున మరణము విధించి యుండబోలును. అమ్మితి దాటశక్యమగునా? సుఖదుఃఖములకు దాను పూర్వమున జేసినకర్మయే మూలమై యున్నది.