పుట:కాశీమజిలీకథలు -02.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతపుష్పము కథ

79

గుర్రము బందెపడి గ్రమముగా రాజుగారి కోటముఖమునకు దేబడినది. దానింజూచి నేను మిగుల సంతసించుచు నృపతియనుమతిని దానిని స్వీకరించితిని. ఆహా! దైవగతి ఎంత వింతయైనదో చూడుడు. న్యాయమైనసొమ్ము నట్టేట బారజిమ్మినను నట్టింటికి వచ్చునను సామెత యథార్థమైనది.

ఇదియంతయు భగవతీకటాక్షముకాక మరియొకటి కాదని నిశ్చయించుకొని కర్మానుసారముగా బుద్ధినడచుననుమాట దృఢపరచుచు మనంబు నెట్లుతోచిన నట్లు చేయుట తప్ప వేరే యాలోచింపక వ్యసనములకు జింతింపక వర్తింపుచుంటిని. అంత మళయాళ దేశప్రభువగు చండవర్మ తనగ్రామమునకు బోపు సమయమున నన్ను దనతో రమ్మని మిక్కిలి ప్రార్ధించిన సంతసించుచు నతనితో గూడ నీ గ్రామము వచ్చితిని. అతండు నాకు నెక్కుడు గౌరవముచేయుచు దనకోటలోనే యొకవిడిది నియమించి యందు నన్ను బ్రవేశపెట్టి యుపచారములకయి తగుపరిచారకుల నియమించెను. నేను సంతతము నావిలాస సౌధంబునం గూర్చుండి యావీణావతివలన దెలియబడిన స్వరవిశేషములనే పాడుచు హాయిగా గాలక్షేపము సేయుచుంటిని. ఒక నాడు సాయంకాలమున నేనా ఫలపుష్పముల రెంటిని ముందిడికొని మనోహరముగా విపంచి వాయించుచుండగా నామ్రోల నొకచిలుక వచ్చి వాలినది.

నేనును బాటసందడిలో దానిని బరామర్శింపకపోతిని. అదియు గొంతసేపు నాయవసరము వీక్షించుదానివలె నిలువంబడి నేనాగానము ముగించి యూరకున్నప్పుడు తనముక్కున దగిలించుకొని పట్టియున్న యొకపత్రికను నామ్రోలవిడిచినది. నేనా చీటిని బుచ్చుకొని విప్పి చదువుకొనినంత నందిట్లున్నది

పురుషోత్తమా! నీయపూర్వగాంధర్వమహిమాతిశయంబును మించిన కళావిలాసమునకు వన్నె వెట్టుచున్న నీసౌందర్యచాతుర్యాదివిశేషములు శ్రుతిపుటద్వారంబున హృద్గతంబులయి మదీయమానసమును హరించినవి. గాంధర్వమహిమంగాక యిట్టి యదృష్టవస్తుచోరక శక్తిగలుగునా? అపూర్వవస్తుదిదృక్ష యెవ్వారికి గలుగకుండును? అద్భుతఫలపుష్పముల నొకసారి జూచితినిగాని తన్నాయకుని సైతము చూచినప్పుడు గదా మదీయచక్షుస్సులు సాద్గుణ్యమును బొందుట. మఱియు నీ మురిపెంపు వీణాగానరసంబాన చెవులు పోరువెట్టుచున్నవి. నాచక్షుశ్రవణంబుల కలహము మాన్ప పాత్రుండవు నీవే వసంతతిలకాభిఖ్యసహకారప్రాప్తి మూలముననేకదా నశేషశోభ వహించును. మఱియును,

వసంతతిలకావృత్తము.

సౌందర్యగానకులశీల కళావిలాసాః
ప్రత్యేకతోపిచనయంతియశః పుమాంసం।
కింవాచ్యమత్ర తదశేషవిశేషలాభే।
తాదృగనంనను నవాంఛతికా వధూటీ॥