పుట:కాశీమజిలీకథలు -02.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అద్భుతపుష్పము కథ

77

సవరించి కొంతసేపు పూర్వమునేర్చిన విశేషములన్నియుం బాడి పిమ్మట వీణావతి స్వరకల్పన లెత్తుకొని యొక కృతిబాడితిని. అప్పుడు సభ్యులందరు చిత్రప్రతిమలవలె కదలక వినుచుండిరి. మరియొక కృతిబాడగా లేచి గంతులువైచుచు నృత్యము జేయ దొడగిరి. ఇంకొకకృతికి వారుగూడ నెద్దియో పాడువారివలె కూనరాగములు తీయ దొడంగిరి. ఈరీతి మేనులు పరవశమొంద సభ్యులందరు కృతికొక వకృతియాకృతితో మెలగదొడంగిరి.

అట్లు కొంతసేపు సభ్యుల వికారము నొందించి పిమ్మట మోహనరాగంబు బాడితిని. దానిని వినుటచే అందరు నరగనుమోడ్పుతో నిద్రావశంవదులైరి. అంతటితో గానము ముగింపగా దెప్పిరిలి యందరు ఏమేమీ! అనన్నా! ఔరా! యని అద్బుతము జెందుచు నిది దేవగానము కాని మనుష్యగానము గాదనియు నితడు తుంబురుడో నారదుడో కాని మనుష్యమాత్రుడు కాదనియు నిటువంటి విచిత్ర మిదివరకు విని యుండలేదనియు జేతనము లచేతనములుగాగ గానముపాడిరను మాట యథార్థమయ్యె ననియు నీ మొదలగు స్తుతివాక్యముల సభ్యులందరు అద్భుతముగా జెప్పుకొన దొడంగిరి.

మణిమంజరియు నాస్వరకల్పన లిట్టివని తెలియక వెఱగందుచుండెను. పిమ్మట ధర్మాంగదుడు నన్ను గౌరవముగా జేరబిలిచి పీఠమిచ్చి అయ్యా! తమదేశ మెద్ది? ఎచ్చటికి బోవుచున్నారు? మీ నామవర్ణంబులేయవి? ఇచ్చటి కెప్పుడు వచ్చితిరి. ఈ అద్భుతగీత మెం దభ్యసించినారు? ఇట్టి విద్య జెప్పదగిన యుపాధ్యాయు డీలోకములో నున్నవాడా? మీఫలపుష్పముల లాగున మీరును నయత్నోపలబ్ధముగా దటస్థించిరి. మాయదృష్టము మంచిదని యనేకవిధముగా స్తుతిచేసెను.

అప్పుడు నేనాఱేనిమాటలు విని కొంత యాలోచించి సంతసించు వానివలె అభినయించుచు అయ్యా! నాపేరు సింహకేతు డందురు. నాజాతి క్షత్రియజాతి, మాది కాశీపురము, దేశాటనము సేయవలయునను అభిలాషతో నిందువచ్చితిని. నేనీ గానము స్వయంకృషివలననే కాని యొకరివలన నేర్చుకొనియుండలేదు. ఇచ్చట సభ జరుగునని విని చూచుటకై వచ్చితి నిదియే నా వృత్తాంతమని చెప్పితిని.

అప్పుడు చండవర్మ నన్ను మీకు వివాహమైనదియా? అని యడిగెను. కాలేదని చెప్పితిని. మరల నతండు మరియు దమ కేయేవిద్యలలో బరిశ్రమగలదని యడుగగా నాకు కొంచెము కొంచెముగా నన్ని విద్యలలోను ప్రశంసయున్నదని చెప్పితిని. తరుచు గాయకులకు నితర విద్యాపరిశ్రమ గలిగియుండుట అరుదు. నాకన్ని విద్యలయందు పాటవము గలదని చెప్పినతోడనే సభ్యులందరు నా విద్యాపరిశ్రమ మెట్టిదో వినవలయునని కుతూహలము గలిగి మరునాడు శాస్త్ర ప్రసంగమునకు మరల సభ చేయవలయునని యమ్మహారాజుగారిని వేడుకొనిరి. అందు మిగుల శాస్త్రపరిచయము గల పండితులు పెక్కండ్రు గలిగియుండిరి. వారితో వాదమునిమిత్తము మరునాడు