పుట:కాశీమజిలీకథలు -02.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రద్యుమ్నుని కథ

11

నేను లోపలకు వచ్చి మిమ్ము వెదకితినిగాని మీరు గర్భాలయములో నుండుటచేతఁ బల్కరించుట తటస్థించినది కాదు. తర్వాత నేను దేవునింజూచితిని. మొదట నా కేమియుందెలిసినదికాదు. చూడఁజూడఁ గన్నులు, మొగము మాత్రము గలిగియున్న మూఁడు మొండివిగ్రహములు గనఁబడినవి. వానినే దేవతలఁగా భావించి మ్రొక్కుచున్న నాతోడివారిని జూచి నేను మ్రొక్కితిని. ఇంతలో జనబాధ యెక్కుడగుడు నన్నందు నిలువనీయక వేత్రహస్తులు వెలుపలకుఁ దోసివేసిరి. ఆ విపరీతంబులఁ బెక్కుగతుల మతిందలంచుచు మీరాక వేచి యిందున్నవాఁడ. ఇంతలో మీ రిచ్చటికి వచ్చితిరి. ఇదియే నా వృత్తాంతము. నేనును లోకంబున ననేకదేవాలయంబులం జూచితిని. పెక్కెండ్ర వేల్పులగంటిని గాని యెందు నిట్టి వింతవేల్పులం జూచియుండలేదు. దీనికెద్దియేని కారణముండకమానదు. నాయందు దయయుంచి ముందు నాకీ సందియము దీర దీని వృత్తాంతము వక్కాణింపుడు. తరువాత జపమునుఁ జేసుకొందురుగాక యని నిర్బంధించిన, సంతసించి యాసిద్ధుండిట్ల నియె.

పుత్రా ! నీ వీప్రశ్న చేయుదువని యిదివరకే యనుకొంటిని. పుణ్యప్రదమైన యిక్కడ వక్కాణింప నాకునుఁ గుతూహలము గలిగి యున్నది. సావధానచిత్తుడవై యాకర్ణంపుమని యమ్ముఖమంటపంబునం గూర్చుండి మణిప్రబోధచేతద్వృత్తాంత మిట్లని చెప్పందొడంగెను.

ఇంద్రద్యుమ్నుని కథ

వత్సా! వినుము. పూర్వకాలంబున నిరావతియను పట్టణంబున నింద్రద్యుమ్నుఁ డను రాజు గలడు. అతఁడు చంద్రసేనయను భార్యం గూడి ధర్మంబున రాజ్యంబు సేయుచు స్వల్పకాలములో నెక్కుడు కీర్తిని సంపాదించెను. ఒకనాఁడమ్మహారాజు సభామంటపంబున సింహాసన మలంకరించియున్నసమయంబున ద్వారపాలకుడువచ్చి నమ్రతతో, దేవా! వింధ్యారణ్యమునుండి కిరాతులు కొందరు వచ్చి దేవరదర్శనము కొఱకు వేచియున్నారు ప్రవేశమున కవసరమేయని విన్నవించి తదీయమస్తకచలనంబున ననుమతి వడసి యబ్బోయెల నాస్థానమున బ్రవేశపెట్టెను.

పిమ్మట నయ్యెఱుకలు, పులిగోరులు, చామరములు, నెమలి పింఛములు, కస్తూరి మొదలగు నడవి వస్తువులు కానుకలు పెట్టి కట్టెదుట నిలువంబడి మ్రొక్కుచు నాగమనకారణం బడుగ నన్నరనాథున కిట్లని విన్నవించిరి.

ఏలికా! మేము వింధ్యాటవిలో నుండు దేవరదాసులము. మాకు పిన్ననాఁటినుండియు నూచలనేయు పాటవము గలిగియుండును. దానం బట్టియే నట్టడవులలో నెట్టి మెకపువెరపును లేక నేకతమకాపురము సేయుచున్నవారము. ఇప్పు డెప్పుడును