పుట:కాశీమజిలీకథలు -02.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాశీమజిలీకథలు - రెండవభాగము

సింహము నా సైన్యంబుల నురుముచేయ దొడఁంగిన దానిం జంపుటకై పోయితిని. నేను పోవువరకు మరియొక వీరుడు దానిని గడతేర్చెను. నేను మరల వెనుకకు పోవునప్పటికి విశాలాక్షి యచ్చటలేదు. నా భార్య సేనలతో నింటికి పోయినది. పిమ్మట నేనా చిన్నదానిని దానిమగనిని వెదకుచు నారు మాసము లాయడవిలో గ్రుమ్మరితిని. పిమ్మట గ్రామములలో నరయుచు దుద కీయూరు జేరితిని. బాటసారిమాట వినక యిందొకనియింట నాతిథ్యమున కంగీకరించి యిట్టియవస్థకు బాల్పడితిని ఇదియె నావృత్తాంతము. ఇందున్నవారందరు నావలెనే మోసపోయిరి. మీ రేమిటికో విచారింపుచుండిరి. ఈబంధనమునగాక వే రెద్దియేని గారణమున్నదా యేమి? తెలుపుడని యడిగిన నతండు తలయెత్తి యతనిని బరామర్శింపుచు నిట్లనియె.

హా ! విశాలాక్షి! హా! ప్రాణనాయకీ! వెర్రిగా నుండినప్పుడే నాయందు భక్తి నీకు మెండుగా నుండునది. ఇప్పు డెంత సంతోషించెదవోగదా? రాజేంద్రా ! నీవు కడుపుణ్యాత్ముడవు. భార్యనైనను గణింపక పరులనిమిత్తము పాటుపడుచుంటివి. నన్నా విశాలాక్షి మగనిగా భావింపుము. సింహమునుజంపిన వాడను నేనే యని నుడివి నంత నాభూకాంతు డత్యంతసంతోషము జెందుచు నోహో మావిశాలాక్షి మగడవు నీవేనా? రూప మామె చెప్పినట్లున్నది. కాని నీతెలివి జూడ వేరొకలాగున దోచుచున్నది. ఇదియునుఁగాక సింహమును గూడ నేనే చంపితినని చెప్పితివి. విశాలాక్షి తనమగడు వెర్రివాడని చెప్పియున్నది. నీ వట్టివాడవే యని యడిగిన నతండు మరల నిట్లనియె.

మదనుని కథ

రాజా! విశాలాక్షి చెప్పినమాట యదార్ధమే నా పూర్వవృత్తాంతము వినిన నీసంశయము వాయును. చెప్పెద నాకర్ణింపుము. మా కాపురము గోదావరీతీరమున నున్న వీరభద్రపురంబను నగ్రహారము. మా తండ్రిపేరు సోమశేఖరుడు. ఆయన చిన్నతనమందే కాశికిబోయియందు బెక్కువిద్యలఁ జదివి యాచార్యులని బిరుదువహించి మరల నింటికివచ్చి యచ్చట బెక్కుక్రతువులు సేసెను. మహర్షితుల్యుండగు నత డొకనా డుదయంబున నగ్నిహోత్రగృహంబుననుండ మాతల్లి పుత్రార్థమై యాచింప సంతసింపుచు బుత్రజన్మహేతుభూతమగు నిష్టినొకటి గావించుటయు దత్ప్రసాదంబున నేను వారికి బుట్టితిని. బాల్యంబున నా రూపంబునకు వెరగందుచు బ్రజలందరు నన్ను మదనుడని పిలవందోడింగిరి. మా తండ్రి నాకు ధనంజయదాసని పేరు పెట్టెను గాని యా పేరున నన్నెవ్వరును పిలవనందున నాకు మదనుడను నామమే వాడుకలోనికి వచ్చినది.