పుట:కాశీమజిలీకథలు -02.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

202

కాశీమజిలీకథలు - రెండవభాగము

వాత నాలోచింపుము. లేనిచో వృథాగా జిక్కు పడవలసి వచ్చునని పలుకుచుండగనే లేచి యతడు తమ్ముడా! రమ్ము. పోదమా విప్రకుమారుడు డెచ్చటనున్నాడని యడిగిన నబ్బలభద్రుండు నతని నప్పుడే యాయంగడికి దీసికొనిపోయెను. కాని యంతలో నారక్షకపురుషులా భూసురతనూభవుని వధ్యభూమికి దీసికొనిపోయిరి. వీధులలో నిలబడి పౌరులు అయ్యయ్యో! ఎంతచక్కనివానికి మృతి ప్రాప్తించుచున్నదోకదా? పాపము వీనికి తలిదండ్రులుగాని యన్నదమ్ములుగాని లేరుకాబోలు. ఏ బుద్ధిమంతుడైన వచ్చి వీనికడ్డుపడిన బాగుండును. కటకటా! ఆ రాజకుమార్తె యింక నెందరి నిట్లు జంపునో! ఇట్టి వ్రతము కూడదని తండ్రియైన బుద్ధిచెప్పరాదా? అసందర్భప్రశ్నముల కుత్తరము చెప్పువాడెవ్వడు అన్నన్నా! తెలియక యీ బ్రాహ్మణకుమారుడు మోసపోయెను. ఇంతకుముందెవ్వరు నిట్టికఠినదండనకు వెఱచియే మేము చెప్పెదమనిరాలేదు. ఇంతకు వానికీరీతి మరణము విధించియుంచెను కాబోలు. ప్రారబ్ధ మతిక్రమింప నెవ్వరి తరమని తమకు దోచిన ప్రకారము చెప్పుకొనదొడగిరి.

అదృష్టదీపు డట్టిమాటలన్నియు వినుచు, "మిత్రగుప్తుడనువా డితని ప్రాణముల గాపాడుటకు రాజుగారియొద్దకు బోయెను అంతదనుక హరిదత్తు నురిదీయవలదని చెప్పుము" నీవచ్చటనుండుమని బలభద్రుని వధ్యభూమికిననిపి తాను రాజవాహను నాస్థానమునకుబోయి యారాజుగారికి నమస్కరింపుచు నిట్లనియె. అయ్యా! మాది కాశీదేశము. నాపేరు మిత్రగుప్తుడందురు. నేను మీ కూతురువేసిన ప్రశ్నములకు హరిదత్తు నిమిత్త ముత్తరమిచ్చువాడ. దీనికి నాకు నారుమాసములు గడువీయవలయును. ఇప్పుడే హరిదత్తు నురిదీయకుండ నాజ్ఞాపత్రిక బంపుడని పలుకుటయు నతనిధైర్యమునకు, సాహసమునకు నాసభ్యులెల్లరు మెచ్చుకొనుచు నితం డతని కెద్దియో కావలయునని యూహించుకొనుచు బెక్కుగతుల దలపోయుచుండిరి.

పిమ్మట నారాజవాహను డతని తెగువకు వెఱగందుచు నేను దారుణమైన శపథము జేసియున్నాడను. నీవట్టిదానిని వినియుంటివో లేదో! హరిదత్తుని గురించియే యందరు నన్ను నిందింపుచున్నారు. నీవు గూడ సదుత్తరం బియ్యలేకపోతివేని మీ యిరువురను నురిదీయవలసి వచ్చును. నీవు చక్కగా నిదానించుకొనుమని యారాజు చెప్పగా విని యతడు మీశపథప్రకారమంతయు వినియే యిచ్చటికి వచ్చితిని. ఆ విషయమై నాకెంతమాత్రము సందియములేదు. వడిగా వధ్యభూమికి నాజ్ఞాపత్రికను బంపుడని తొందర పెట్టుచు బలికెను. పిమ్మట రాజవాహను డతనిపేరు వ్రాసికొని యతనిచేత నారుమాసములకు దిరిగివచ్చునట్లుగా బ్రమాణికము చేయించుకొనుచు నంతవరకు నురిదీయక హరిదత్తుని గారాగృహమున నుంచునట్లాజ్ఞా పత్రికవ్రాసి యప్పుడే పంపెను.

ఆ పత్రిక చేరినతోడనే రక్షకభటులు హరిదత్తు నురిదీయక మరల దీసికొని వచ్చి బంధీగృహములో నుంచిరి. అదృష్టదీపునికి హరిదత్తుని జూడవలయునని యభిలాష గలిగినది కాని యప్పటి కార్యపుతొందరచే జూచుట దటస్థించినదికాదు. తరు