పుట:కాశీమజిలీకథలు -02.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంతిమతి కథ

199

కాంతిమతి - నాతో బరిహాసములాడక నిజము చెప్పుము. అతండు తిరిగి యిచ్చటికి వచ్చి నన్నాదరించునా?

చతురిక - ఏమిచేయునది యా యుత్తరమే చెప్పుచున్నది.

కాంతిమతి - దానింజూడ ననురాగసూచకముగానే యున్నది. అతండిట్లు ప్రచ్ఛన్నముగా దిరుగుట కేమి కారణమున్నదియో ?

చతురిక - సన్యాసి చేయి చూచినప్పుడే చెప్పెను. అయ్యోగి మిక్కిలి తెలిసినవాడు. యెద్దియో కారణమున్నది. మరియేమియో యననేల. నిన్ను వరించుటకే.

కాంతిమతి - ఇట్టి యుత్సాహముగూర్చిన నీకు బ్రతి యేమి చేయగలను. ఇదిగో! గాఢముగా నాలింగనము జేసికొనుచున్నదాన నని యట్లు చేసినది.

తరువాత జతురిక యావార్త మెల్లగా గాంతిమతి తల్లితో జెప్పినది. ఆమె సంతోషింపుచు నొకనా డేకాంతముగా నున్న సమయంబున మగనితో నదృష్టదీపుని ప్రశంస వచ్చుటయు నాయన మీ కల్లుడయ్యెనని చెప్పినది. ఆ మాటవిని యతం డదరిపడుచు నది యెట్లని యడుగ తనకు గూతురు జెప్పిన వృత్తాంతమంతయుం జెప్పి యా యుత్తరమును జేతి కిచ్చెను. ఆ రాజు మొదట గొంతసేపు నమ్మలేదు. కాని అదృష్టదీపు డంతకు బూర్వము తనకు వ్రాసినయుత్తరము దెచ్చి చూచి యందలివ్రాలును నిదియు నొక్కరూపున నుండుటచే నమ్మక తీరినదికాదు. అట్టివాడు తనకు నల్లుడగుటయే చాలునను సంతోషముతో గూతు నేమియు నిందింపక గాంధర్వవివాహము దూష్యము కాదని శాస్త్రవేత్తలచే దెలిసికొని యయ్యువతి గర్భవతి యగుటకు మిక్కిలి సంతసించెను. పిమ్మట నా రాజపుత్రికను సురక్షితముగా గాపాడుచు నదృష్టదీపుని వార్త దెలిసికొనుటకయి నలుమూలలకు బెక్కండ్ర దూతల నంపెను.

అచ్చట అదృష్టదీపుడు బలభద్రుడు వచ్చినతోడనే యా యూరువెడలి యొకమార్గమునంబడి నడుచుచు గాంతిమతి యొక్క క్రీడావిశేషములన్నియు బలభద్రునితో జెప్పుచు దద్వియోగమునకు మిక్కిలి పరితపించుచుండ బలభద్రుం డోదార్చుచుండెను. ఆ రీతి బదిదినములు ప్రయాణము చేసినంత మరియొక పట్టణము గనంబడినది. దానిపేరు పుష్పగిరి. దానిని రాజవాహనుడనురాజు పాలించుచున్నవాడు. అదృష్టదీపుడు మిత్రునితో గూడ నట్టిపట్టణములో బ్రవేశించి తన పేరం బ్రసిద్ధిజెందిన సత్రములో బసచేసెను.

ఆ గ్రామములోగూడ నదృష్టదీపునిపేరు మిక్కిలి వాడుకగా నున్నది. అతం డట్టివిశేషములన్నియుం బరీక్షింపుచు గొన్నిదినము లాయూర వసియించెను. ఒకనా డదృష్టదీపు డాసత్రములో నొకవేదికపై గూర్చున్న సమయంబున నొక బ్రాహ్మడు డతనిముఖము సాభిప్రాయముగా జూచెను. అదిగ్రహించి యదృష్టదీపు డాబ్రాహ్మణునితో అయ్యా! మీదేదేశము? ఇచ్చటి కెప్పుడు వచ్చిరి? ఎచ్చటికి బోయె