పుట:కాశీమజిలీకథలు -02.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

186

కాశీమజిలీకథలు - రెండవభాగము

అసత్యములు పలుకు వారము కాము. నేను మొదట జెప్పినదే నిక్కువము. ఈ విషయమై సారెసారెకడుగకుము. నీవు నాకు జేయదలచికొనిన యుపకార మెద్దియో చెప్పుము. నేను ద్వరగ బోవలయుననియు పలుకుచుండగనే సాయంకాలచిహ్నము తెలుపు భేరీవాయించిరి.

అప్పుడా యింటి ద్వారరక్షకులు వచ్చి తలుపు తట్టుచు చతురికా! సాయంకాలపుభేరిని వాయించుచున్నారు. ఇక తోట తలుపులు మూయుదురు. భర్తృదారిక శకటములో నంతఃపురమునకు బోవలసియున్నది. గావున వడిగా బోవలయునని పిలిచిరి. ఆ మాటలు విని యదృష్టదీపుడు వెరచుచు జతురికం జూచి యిప్పుడు నేనెట్లు మాయింటికి బోదునని యడిగెను. అప్పటికి వారికి గోటలోనికి బోవక దీరదు గనుక నది సమ్మతించుచు కానిండు మీతో ముచ్చటింపవలసిన సంగతులు పెక్కుగలవు. అవి యన్నియు బిమ్మట జెప్పెదను. ఇప్పు డీదారిం బొండు మి మ్మెవ్వరు నడ్డపెట్టరని పలుకుచు రెండవగుమ్మమునుండి యతని నాయిల్లు వెడలించినది. పిమ్మట గాంతిమతియు జతురికతో గూడ నాతలుపులు తెరచుకొనుచు నిల్లువెడలి బండి యెక్కి యతివేగముగా నింటికి బోయినది.

అట్లు పోయి యక్కాంతిమతి యంతఃపురమున నేకాంతముగా జతురికతో గూడ శయ్యాతలంబున మేను జేర్చి యిట్లు చింతించెను. చతురికా! నీ చాతుర్యమంతయు నెచ్చట దాచితివి! అక్కుమారరత్న మెదురునున్నప్పు డేమియు మాట్లాడలేకపోయితివే. నాహృదయంబున నెన్నియో కోరిక లూరుచున్నవి. నేనేమి చేయుదును? ఈ దుర్మార్గపు సిగ్గు నన్ను మాటాడనిచ్చినది కాదు. అయ్యో! దొరకిన ఫలము చెడిపోయినదే తటాలున బోయి వానిం గౌగలింపక యెద్దియో యాలోచింపుచు దెల్లబోయి యూరకుంటిని. అన్నన్నా! నా యభిప్రాయమయిన వెల్లడి చేసితిని కాదేమి? చివరి కతని యభిలాష సైతము మనకు దెలియలేదు. మంచిపని చేసితివిలే? ఏమేమో చెప్పబోయి యేమో చెప్పితిని. నా యొద్ద నెన్నియా యుక్తులు పలుకుదానవు. నాకీ సిగ్గడ్డము లేనిచో నా చమత్కార మంతయు జూపకబోవుదునా? కార్యము చెడగొట్టితిని. ఇంక నెప్పుడో చెప్పెద ననుకొను నంతలో సాయంకాలమైనదేమి? మన మా మేడలో నెంతసేపుంటిమి. నిమిషములాగైన దోచలేదే? అబ్బబ్బా! మేనంతయు భగ్గున మండిపోవుచున్న దేమి? ఇట్టి బాధ యిదివరకు నే నెప్పుడు ననుభవించి యెఱుగను. అతనికి మనయందిష్టమున్నదా? అతండైనను సాహసింపలేకపోయె నేమి? ఒకవేళ నతండు నీకుపకారము సేయవలయునని తాత్పర్యముతో వచ్చెనేమో? నీవు భ్రమపెట్టి తీసికొని వచ్చితివి. నిజము చెప్పితివి కావు. ఇదియు నీతప్పే! ఈ రాత్రి నే నెట్లు వేగించుదాన? మనము నిజముగా వానిం జూచితిమా? అది స్వప్నమా! మన మిప్పు డెచ్చటనుంటిమి? ఇది రాత్రియా పగలా? నా కేమియు దెలియకున్నది. సఖీ! మన మచ్చట గొంతసేపు నిలువక వచ్చితి మేమి? అదియా. తెలిసినది. పోనీ ఆరాత్రి