పుట:కాశీమజిలీకథలు -02.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

170

కాశీమజిలీకథలు - రెండవభాగము

కావున యుదయంబునఁ గదలలేక రాచపట్టి నక్కునం బెట్టుకొని యొక చెట్టునీడం బండుకొని నిద్రఁబోయినది.

ఇంతలో నాచెట్టుతొర్రలోనుండి యొకకృష్ణసర్పమువచ్చి యా నింబవతిం గరచి దానిప్రక్కలో నాడుకొనుచున్న చిన్నవాని శిరముపై బడగపట్టి యాడందొడంగినది ఆ దాదియు సర్పగరళము తలకెక్కినంత దృటిలోఁ బ్రాణములు విడిచినది. అయర్భకుఁడు దాది యెంతసేపటికిని లేపోవుటచేత నడలుచు గొంతెత్తి యేడువసాగెను. ఇంతలో నాప్రాంతమందుఁ బశువులు గాచుకొనుచున్న గొల్లపిల్లవాండ్రు ఆదారినివచ్చి యాపామును బాలకునిం జూచి వెఱచుచుఁ గర్రతో సర్పమును బెదరించిరి.

అదియు దండతాడనభీతిచేఁ బారిపోయి వివరములో దూరినది. పిమ్మట నాబాలుడు నింబవతి నోటినుండిఁ వెడలెడు నురుగునుఁ జూచి యది పాముగరచి చచ్చెనని యూహించికొని యా డింభకు నెత్తుకొని సంతోషముతో నా ప్రాంతమందే యున్న తమ పల్లెకుఁ బోయి పెద్దల కావృత్తాంతమంతయుం జెప్పి యా బాలునిఁ జూపించిరి. ఆపల్లెలోఁ పెద్దగొల్ల పింగళకుడను వాఁడా వార్తవిని తనకు సంతతి లేదు కావునఁ దానిబాలునిఁ బెంచుకొనియెదనని చెప్పి యప్పాపనిం దెప్పి తనయింటం బెట్టుకొని వెన్నయు మీగడయుఁబెట్టి గారాబముగాఁ బెనుచుచుండెను. ఆపిల్లవాని కులగోత్రనామంబు లెవ్వరికిఁ దెలియవు మరియుఁ బింగళకునితల్లి తలపై సర్పమునీడఁబట్టిన వాఁ డదృష్టవంతుఁ డగునని జెప్పఁగా వానికి దండ్రి యదృష్టదీపుఁడని పేరుపెట్టెను.

అదృష్టదీపుని కయిదేడులు ప్రాయమువచ్చినతోడనే యాపల్లెలోనున్న బడిలోఁ జదువవేసిరి. ఆబడిలోఁ జదువుచెప్పువానికి నక్షరములపలుకుబడిమాత్రము తెలియును. అచట వాఁడే మిగుల పండితుఁడు. అదృష్టదీపుఁడట్టి చదువును స్వల్పకాలములో గ్రహించి క్రమక్రమముగాఁ దనబుద్ధిబలముచే జురుకుగా వ్రాయుటయుఁ జదువుటయుఁ నేర్చుకొనియెను. రత్నము బొగ్గులలోఁ బెట్టినను సజమైన కాంతిని విడుచునా! ఆపిల్లవాని కేడెనిమిదేండ్ల ప్రాయమువచ్చినప్పుడు పింగళికుఁడు కొంతమంది బాలురజతయిచ్చి తనపశువులవెంట నడవికిఁ బంపుచుండును. అదృష్టదీపుఁడును తోడిబాలురతోఁ బశువుల వెంట నడవికిఁబోవుచు సాయంత్రము దనుకఁ బశువులమేపి రాత్రికింటికివచ్చుచుండును.

రాత్రిసమయములం దదృష్టదీపునికి పింగళికుని తల్లి మిగులవృద్ధురాలు పూర్వపురాజుల చరిత్రలు కధలుగాఁ జెప్పుచుండ సంతోషముతో వినుచు నతం డడవిలో నున్నను లోకమర్యాదలన్నియు జక్కగా గ్రహించెను. విశాలమైన నేత్రములు, చంద్రబింబమువంటి మొగము, విండ్లవంటి బొమముడులు, చక్కనిచెక్కులు, నాజానుబాహువులు, సింహసంహననము గలిగి యదృష్టదీపుఁడు మసిపాతనుఁ గట్టిన మాణిక్యమువలె నగ్గొల్లవాని యింటిలోఁ బెరుగుచు నడవికిఁబోయి పశువులం గాచుచుండెను. అత