పుట:కాశీమజిలీకథలు -02.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంద్రుని కథ

141

కష్టము. ఇప్పుడు మనలను జూచినచో శంకింతురు. ఎన్ని దినము లీమాటున నుందుము. నాకుగూడ నవ్వలకుబోవుట దుర్ఘటము. ఈ సభలోనికి వచ్చువారికి బోవువారికిని లెక్కయున్నది. ఆ మార్గమునరాక నేను బోయినచో నెట్లు లోపలికి బోయితివని యడుగుకుందురా! అడిగినప్పు డేమిచెప్పుదును. అని పెక్కుతెఱగుల దలపోయుచు నంతలో గన్నులుదెఱచి ఆఁ! జ్ఞాపకము వచ్చినది. రుచికా! మనకొక యాధారమున్నది. రేపు రాబోవు శుక్రవారమున నీయూరిలో శ్రీపుష్పయోగమను నుత్సవము చేయుదురు. ఆ యుత్సవమునకయి రాత్రి పార్వతీపరిణయమను నాటక మీసభలో నాడుదురు. అప్పుడు మిగుల సమ్మర్ధముగా నుండును. ఆ సందడిలో నెట్లయిన దాటి పోవచ్చునని పలుకుచు మరల భీతినభినయించుచు నయ్యో! దీనిలో నాకొక యుపద్రవము బొడగట్టుచున్నదే ఆ నాటకము బృహస్పతిగారు రచించిరి. అందులో నే నొక భూమికను, ఊర్వశి పార్వతివేషము వైచును. నేనామె చెలికత్తెయైన జయవేషము వైచుటకు నిరూపింపబడితిని. కథాసరణియంతయు నిదివరకే వర్ణించితిని. ఆ నాటకములో భూమికలుగానున్న వారందరు రేపటిరాత్రి బృహస్పతిగారి యింటికి బోవలయును. అప్పుడే నాపరీక్ష వచ్చును. దీని కేమిచేయుదును. అని పెక్కు తెఱంగుల జింతింప దొడగినది.

దాని యధైర్యమునుజూచి నేనును విదారింపుచు మనంబున మా కులదైవ మగు జగన్నాథస్వామిని ధ్యానింపుచుంటిని. అదియు దుఃఖావేశమున మేను తెలియక పడియున్నది. అప్పుడు నాకు మిక్కిలి యాకలిగా నుండగా నాసభలో నలంకారమున కయి వ్రేలగట్టిన ఫలములను కొన్ని తిని యాకలి యడంచుకొంటిని అట్టి విచారముతో నాదినము గడపితిమి. మరునాడు తిలోత్తమ తనకు వాటిల్లిన యిడుమును గురించి విచారింపుచుండగా నింతలో భేరీధ్వని యొకటి వినబడినది. ఆ రవము చెపియొగ్గి విని యోహో! ఇంద్రుడుగారిప్పుడు సభకు వచ్చుచున్నారు. ఎద్దియో కారణమున్నది. లేకున్న నసమయమున నిచ్చటికిరారు. ఎంతయో గొప్ప కారణముండినగాని క్రొత్త వేళల నోలగము సేయరు. ఆయన యాస్థానసమయము లన్నియును మాకు దెలియును. కావున నిప్పు డేమేమి చెప్పుకొనియెదరో వినవచ్చును. సావధానముగా నుండుము. తల మాత్రము పైకెత్తకుము అని పలికినది.

ఇంతలో దేవేంద్రుడు బృహస్పతి దేవతలు విచారముఖములతో సభకు వచ్చి వారివారిస్థానముల గూర్చుండిరి. రంభాది దేవకాంతలు వచ్చిరి గాని నృత్యగీతాదివ్యాపారములు మాని నిశ్శబ్దముగా నెదుర నిలువబడిరి. పిమ్మట దేవేంద్రుడు లేచి యెల్లరు విన నిట్లనియె. ఆచార్యా రక్తాక్షుని పుత్రుడు విరూపాక్షుడను వాడు సంగర