పుట:కాశీమజిలీకథలు -02.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తురాలి కథ

121

ముఖమండపములో దంత్రీనాదముతో గంఠస్వరము మేళగించి మనోహరముగా శివకీర్తనల బాడుచున్న యాభక్తురాలింజూచి దానిరూపమున కాశ్చర్యమందుచు మంత్రిపుంగవుం డంతరంగమ్ముననెద్దియో సంతోషంబు దీపింప గొంతసేపు రెప్పవాల్పక యామెంజూచెను.

మంత్రి లోనికిఁబోయినంతనే యాభక్తురాలును నచ్చట నున్నవారును తటాలున లేచి యవ్వలికిం బోయిరి. ఇంతలో లోపలనుండి గుడిధర్మకర్త వచ్చి వీరగుప్తుని సగౌరవముగాఁ తీసికొనిపోయి యాలయము చుట్టునుంగల వింతలును నచ్చటచ్చటఁగల విశేషంబులు చూపుచుఁ గ్రమంబున గర్భలయములోనికిఁ దీసికొనిపోయి స్వామినిఁ జూపించి తదీయమహిమావిశేషముల వక్కాణింపుచు మరల ముఖమంటపము దాపునకుఁ దీసికొనివచ్చి యచ్చట తగిన యాస్తరణలు వేయించి యందుగుర్చుండం బెట్టెను. అప్పుడు వీరగుప్తుఁడు ధర్మకర్తంజూచి మనము వచ్చువరకు నిచ్చట పాడుచున్న చిన్నదియెవ్వతె అని అడిగెను. అదియొక భక్తురాలు దాని కులశీలనామంబు లెవ్వరకినిఁ దెలియవు. కొన్నిదినములఁబట్టి యిూ యాలయములోనున్న విజ్ఞానయోగి నాశ్రయించుకొని యున్నది. నిత్యము సాయం తమీస్వామిపై కీర్తనలు పాడుచుండును. దానికి భోజనము స్వామి నైవేద్యములోనిదే యిచ్చునట్లేర్పరచితినని ధర్మకర్త చెప్పెను.

దీనికంఠస్వరము చక్కగానున్నదిసుమీ అని మంత్రి పలుకఁగా విని అతండు తమసెలవైనచోఁ దిరుగపాడింతును. దానికేమి కొదవ అది మనస్వామిదాసురాలే అని పలుకుచు భక్తురాలియొద్దకుఁ బోయి అమ్మా! యిప్పుడు మంత్రిగారు నీ సంగీతమువిన వేడుక పడుచున్నారు. వడిగావచ్చి రెండు శివకీర్తనలు పాడుమని చెప్పగా నామె కొంచెముసేపు వచ్చుటకు సంశయించెను. కాని మరలనేమియనుకొనినదో తటాలునఁ జనుదెంచి మంత్రికి నమస్కరించుచు నతని అనుమతిని శ్రుతి మేళగించి జక్కఁగా బాడఁదొడంగినది. ఆ భక్తురాలు కాషాయవస్త్రము ధరించి మేనెల్ల విభూతిఁ బూసికొని దుద్రాక్షలు ధరించియున్నను నివురుగప్పిన నిప్పునుంబోలె నొక అద్భుతతేజంబునఁ బ్రకాశిల్లుచుండుట వీరగుప్తుఁడు దానిని మిక్కిలి నిరూపణపూర్వకముగా జూచుచుండెను.

మరియు నా భక్తురాలు శివకీర్తనలు పాడుచు నడుమ నొక గీతము పాడినది. ఆ గీతము చంద్రలేఖ రచించి తిలోత్తమకు జెప్పినది. దానిలోఁ జంద్రలేఖ అంకితమున్నది. అట్టిదానిం బాడినతోడనే వీరగుప్తవేషముతో నున్న చంద్రలేఖ యుల్లము ఝల్లుమనం దల్లడిల్లుచు నౌరా! యీగీతము నేను రచించినది. ఇది తిలోత్తమకుగాక మరియెవ్వరికిఁ జెప్పియుండలేదు. ఆ తిలోత్తమ మరియొకరికిఁ జెప్పి