పుట:కాశీమజిలీకథలు -02.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

కాశీమజిలీకథలు - రెండవభాగము

రిచ్చటకు వచ్చితిరి. నన్ను రక్షించి దరిఁజేర్పుడని ప్రార్థించినది. అప్పుడు రాజకింకరులు దాని దీనాలాపములు విని జాలిపడి అభయమిచ్చి యా చిన్నది చెప్పిన మాటలను గురించి యోడసరదారునడిగిరి.

వాఁడును బెదరుగదుర అయ్యా! యా చిన్నది మాకు నోడకూలి యియ్యవలసి యున్నది. ఇమ్మని యడుగుచుంటిమి కాని మరియొకటి కాదు. మా కియ్యకుండఁబోవలయునను తాత్పర్యముతో నట్లనుచున్నది. నేనేమియు నెరుఁగనని చెప్పెను. ఆ భటులు వాని పోలిక గనిపెట్టి యట్టిపని కుద్యోగించినట్లు గ్రహించిరి. కావున వానిని వదలించి చంద్రలేఖను నెమ్మదిఁగా దీరమున దింపించిరి.

వీరగుప్తుని కథ

అప్పుడు చంద్రలేఖ స్త్రీజాతిని నిందించుచుఁ గటగటా! యిట్టి కష్టపుజన్మమెత్తితి నేటికి? నా రూపమే నా కింత ముప్పు తెచ్చుచున్నది. ఎచ్చటికిఁ బోయిననుఁ జిక్కులే వచ్చుచున్నవి. ఇఁక నీ రూపము మార్చి పురుషవేషము వేసికొనిన సుఖముగా నుండవచ్చును. అన్నన్నా! పురుషజన్మ మెంత యుత్తమమయినదో గదా? యని తలంచుచు నప్పుడే యంగడికి పోయి తనవద్ద నున్న మణిభూషణ మొకటి యమ్మి దానివలన వచ్చిన సొమ్ము పెట్టి మంచి దుస్తులుకొని యారాత్రి యొకచోటునఁ బురుషవేషము ధరించెను. పురుషవేషము వేసినప్పుడును. జంద్రలేఖ మిక్కిలి చక్కగా నుండెను మరియుం దగినకైదువు దానికిం దగిన దుస్తులును సంపాదించి వీరపురుషవేషముతో నా రాజధానిలో వీరగుప్తుఁడని పేరు బెట్టుకొని తిరుగుచుండెను. ఆ పట్టణమును ధర్మాంగదుఁడను రాజు పాలించుచుండెను. దైవవశంబున నాధాత్రీపతి మంత్రి కాలధర్మము నొందెను. ఆయుద్యోగంబు తమకిమ్మని యనేకులు వచ్చిరి. కాని రాజుచేసిన పరీక్షలకు నొకఁడైనను సదుత్తరంబు చెప్పలేకపోయెను. దానంజేసిన రాజా యుద్యోగం బెవ్వరికి నియ్యలేదు మరియు నే నడిగినతోడనే నా వచనంబులకు నా చిత్తవృత్తి ప్రకారంబుత్తరం బెవ్వఁడిచ్చునో వానిని మంత్రిగా స్వీకరింతునని తన సింహద్వారంబుపైనఁ బ్రకటన పత్రిక గూడఁగట్టి యుంచెను. ఎవ్వండు వాని మాటలకు సదుత్తరంబు చెప్పలేదు. ఇట్లుండ నా వీరగుప్తుండొకనాఁడు విలాసార్థ మా పురమంతయుఁ గ్రుమ్మరుచుఁ గోటగుమ్మము దాపునకుఁ బోయి యందున్న ప్రకటన పత్రికఁజదివి సంతసించుచుఁ దనపేరు వ్రాసి నేను మీ మాటలకు దగిన యుత్తరం బిచ్చెదనని పతిక వ్రాసి యా రాజుగారి యొద్దకుఁ బంపెను. ఆ నరపతి చదువుకొని యంతకు మున్నట్టి వారలనేకులు వచ్చిపోయిరి కావున విసిగికొనుచు