పుట:కాశీమజిలీకథలు -02.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలసింహుని కథ

117

కుఁడు చంద్రలేఖను దిగకుండ నాటంకము జేసెను. అప్పు డాకలికి నీకీయవలసిన సొమ్మెంత అని అడిగినదానికి నీవెచ్చట నెక్కితివో చెప్పుమని అడుగుటయుఁ దనకు రేవుస్థలముల పేరేమియుఁ దెలియమింజేసి యోఁడ గాలిచే యొడ్డునకు విసరఁబడిన చోట నెక్కితినని చెప్పినది. అప్పుడది చెప్పిన మాటలకతండు వెఱఁగందుచు నోహో! అది రేవుస్థలము కాదే అట్టి అరణ్యంబులో నొంటిగా నీవెట్లు వచ్చితివి? నిన్ను జూఁడ ననుమానముగా యున్నది. తరువాత విమర్శింతుము. ఇప్పుడు తొందరగా యున్నదని పలుకుచు నానెలఁత నొకయరలో నుంచునట్లు తన పనివాండ్రకు నియమించెను.

మార్గస్థులందరు నోడఁదిగి యరిగిన తరువాత సరదారుడు చంద్రలేఖ దగ్గిరకు వచ్చి మచ్చెకంటీ! నీవెచ్చటిదానవు! నీపేరేమి? యా రేవునకెట్లు వచ్చితివి? యెందుబోవుచున్న దానవు! నీ కేమియుభయము లేదు. నిజము జెప్పుమని శృంగారహాస విలోకనంబులంజూచి యడుగుచున్న వాని అభిప్రాయము గ్రహించి యయ్యించుబోఁడి యిట్లనియె. అన్నా? నా నివాసస్థలము రామచంద్రనగరము. నేను మా బంధువులతోఁగూడి యిందున్న మాపినతల్లినిఁ జూచుటకయి వచ్చుచు దారితప్పి బంధువులతో విడి అచ్చటికిఁ జేరితిని. ఇంతలో మీయోడ అచ్చటికి వచ్చినది. అదియు నా పుణ్యమే అనుకొని అందెక్కితిని. దీనికిఁ బారితోషికముగా నీమణిభూషంబుచ్చికొని నన్నుఁ దీరమున దింపుము. నీకుఁ గడుపుణ్యము గలదని దీన ముఖముతోఁ బ్రార్ధించిన విని వాఁడు స్మరశరపీడితహృదయుండై యిట్లనియె మదవతీ! నిన్నుఁ జూచినది మొదలు మదనుఁడు నన్ను వేపుచున్నవాఁడు. ఒక్కసారి నీ చక్కని చెక్కులు ముద్దుఁకొని యధరరసంబు చవిచూచెద. ననజ్ఞ యిమ్ము. నీవు దానికేమియు నియ్యనక్కరలేదు. ఈ మాత్రంబునకే సంతసించెద నేమనియెదవని అడిగిన నమ్మగువ ముక్కు మీఁద వ్రేలువైచుకొన అయ్యో! యిదియేమి ద్రోహము సంసారిని యిట్లనవచ్చునా నావంటి వారలు నీకు లేరాఁ అట్టిపని కెన్నడును నేనుబ్యోగించు దానను కాను. నాయందుగల మరులు మరలించుకొనుము. నన్ను వేగిరము తీరమునుఁ జేర్పుమని పలుకఁగా నతండు మరియేమియుం జేయను. ఒకసారి ముద్దు బెట్టుము. ఊరక చెడిపోక నా మాట వినుము అని పెక్కుగతుల వేడికొనిన నాచేడియ సమ్మతించినది కాదు

అట్లు వారిరువురు వాదించుకొనుచున్న సమయమందుఁ గ్రొత్తగా వచ్చిన యోడలఁబరీక్షించెడు రాజభటు లా యోడమీఁదికి వచ్చి యోడ సరదారు డెక్కడని కేకలువైచిరి ఆ కేకలు విని వాఁడు మిగుల భయపడుచు లేవఁబోవు సమయమునకు వారే అచ్చటికి వచ్చిరి. వారిం జూచి చంద్రలేఖ వందనములు సేయుచు అయ్యా! వీడు నన్నేమి చేయుచున్నాఁడో చూచితిరా? నేనొక బాటసారిని. మా వాండ్రందరు దిగిపోయిరి. నన్ను దిగనీయక నిర్భందించుచున్న వాఁడు. నా పుణ్యము వలన మీ