పుట:కాశీమజిలీకథలు -01.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

అక్కపటం బెఱుంగక యక్కలికి యక్కడనే దాచెను. మఱి వసంతుడును రెండు మూడు దినములలో నిల్లుజేరి యధేష్టకామంబుల సంతుష్టి నొందుచుండెను.

ఇట్లుండ యొకనాడు రేయి నా దంపతులు బెద్దయుంబ్రొద్దు గంతుగేళులం దేలి యలసి సొలసి గాఢనిద్రాపరవశులై యున్నవేళ జూచి యా నీచురాలు మెల్లన నవ్వఱ సంగ్రహించి యొక రాయిమీద దానియర లరుగదీయ దొడంగిన నా రాజకుమారునికి మరణావేదన యావిర్భవించి నిట్టూర్పులతో నిట్టటు గొట్టుకొన దొడగిన నా రాయడి కిచ్చేడియ మేల్కని పతిని లేపియు లేవకున్న దొందరపడుచు దలయంపినున్న వఱను వెదకి గానక తటాలున మునలిదియుండు గదిలోని కేగుటయు నదిగేగిరించి వఱయర లరగదీయుచుండ వీక్షించి యేమే నిర్భాగ్యపుముండా! యిట్టి ద్రోహకృత్యమున కొడి గట్టితివి ? ఆయన నీకేమి యపకారము గావించెనే కటకటా! నిన్ను జనని యని నమ్మినందులకు మంచి యుపకారము గావించుచుంటివి. అయ్మో! నేనేయు చేయుదు నెవ్వరు దిక్కని పెద్ద యెలుంగున నేడ్చుచు నవ్వఱయూడ బెరకికొనిన నక్కలికితో నది యిట్లనియె.

పట్టీ! యూరక నన్నేల దిట్టెదవు? నీ మగడు చెప్పిన గుట్టు వట్టిదో నిజమో యని పరీక్షార్థమయి యిటు గావించితిని గాని ద్రోహబుద్ధిగాదు. ఇంత మాత్రమున నతనికి నిజముగా నాయాసము సంభవించినదే చూతము రమ్మని యా గదిలోని కరిగి యతనిం జూడ నఱయరలు నిశ్శేషముగా నరుగదీయలేదు. గాన నించుక ప్రాణము గలిగి యున్న వాడుగాని యా రహస్యమది గ్రహింపలేక చచ్చెనని మిగుల నానంద మందుచు బైకి గళావతికన్న నెక్కుడు చింతించుచు నామెతో నిట్లనియె.

అబలా! ప్రమాదవశంబునం జేసితిని. కానిమ్ము నే నొకసిద్ధౌషధమువలన వీనిని బ్రతికించెద. నీవు చింతింపకుము. చింతించినచో బ్రతుకనేరడు. దానికి ముందు నీవు సముద్రోదకంబుల దలయంటుకొనవలయు. ఆలస్యముచేయక యందుబోదము రమ్ము. అతని వియోగము నీకన్న నాకు వ్యాకులముగానున్నది. అని పలికిన బాప మక్కలి కిదియు నిజమని నమ్మి చింతించుటమాని యమ్మాయలాడితో సముద్రతీరమున కరిగినది.

అప్పు డది పట్టీ! వట్టినేలం గూర్చుండి తల యంటుకొనరాదు. అల్లదిగో ప్రాంతమున నెద్దియో చిన్నదోనె గాన్పించుచున్నది. దానిమీద గూర్చుందువుగాని రమ్మని యచ్చటికిం దోడ్కొనిపోయి యా నావ కొనబల్లమీద గూర్చుండబెట్టియొడలు నలుగిడ కన్నులు మూసికొమ్మని తలమీద పులుసుపోసి యొకచేత రుద్దుచు రెండవ చేత జరుకోలతో నద్దోని త్రోసికొని యొక నిముషములో బెద్ద యోడయొద్ద కరిగినది.