పుట:కాశీమజిలీకథలు -01.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేవతావస్త్రముల కథ

51

గుల్లలు లోనగునవి మాత్రము సంగ్రహించిరి. వాకిట తమ యాజ్ఞలేక యన్యుల రానీయకుండునటుల కావలివానిం బెట్టి లోపల నిష్టమైన వినోదములతోఁ బ్రొద్దుపుచ్చుచుండిరి.

ఇట్లుండునంత రెండుమాసములయిన పిమ్మట కానీన నృపాలుఁ డొక్కనాఁ డాపుట్టముల పని యెంత యైనదో యని తెలిసికొన వేడుకపడుచు నవ్విశేషములఁ జూచి రండని గ్రామాధికారుల వారియొద్ద కనిపెను. అట్టి పుట్టంబులం జూడ వారికిని మిగుల వేడుకగా నుండుటచే సత్వరముగా వరప్రసాదుల నెలవున కఱిగి కావలివానిచేఁ దమరాక వారి కెఱింగించిరి.

వరప్రసాదులును ముహూర్త మాత్రము నిలిపి తీసికొనిరమ్మని కావలివానికాజ్ఞ యిచ్చి యింతలో రాట్టములు దోడుబద్దలు సర్దుకొని వట్టిరాట్టముల నూలొడుకువారివలెఁ ద్రిప్పుచు నూలుచుట్టువారివలెనే తోడుబద్దలకుఁ జుట్టుచుండిరి. అంతలో గ్రామాధికారులు లోనికి వచ్చిరి. అప్పుడు రాముఁ డెదురువోయి సముచితసత్కారముల వారిం గౌరవించి తగుపీఠములఁ గూర్చుండబెట్టి కొండొకవడికి నావట్టిచుట్టుబద్దలు వారికి జూపించుచు నిట్లనియె.

అయ్యా! నూ లెంతసన్నమో చూచితిరా! మృదువు పరీక్షింపుఁడు. ఎంత సొంపుగా నున్నదో చిత్తగించితిరా! చేతం బట్టి చూడుఁడని దాపుగా నాకండెలం గొనిపోయి చూపించుచు రెండుమాసములకు నూలు తయారగుటయే దుర్ఘటమగుచున్నది. ఇట్టి నూలు మీ రెన్నఁడైన జూచితిరేమో నిజము చెప్పుడని యడిగెను. ఆ గ్రామాధికారులు వెఱఁగుపడి తన కేమియుఁ గాన్పింపకున్నతఱిఁ దమతల్లిం దూరుచుఁ దద్దోషంబుననే యవ్వింతనూ లదృశ్యమైనదని నిశ్చయించి దాని మహత్వ మగ్గించుచుఁ గాన్పింపలేదంటిమేని తమమాతృదోషము వెల్లడియగునని తలంచి యది నిజముగాఁ దమకుఁ గనిపించుచున్న ట్లభినయించుచు దాని మార్దవము సాపు సన్నమును విన్నాణమును రామునికన్నఁ బెద్దగాఁ గొనియాడదొడఁగిరి,

గ్రామాధికారు లిరువురిలోఁ గరణమునకుఁ గాన్పించెనని కాపును కాపునకుఁ గాన్పించెనని కరణమును దలఁచి యా గుట్టు తెలియనీయక మాట్లాడుచుండిరి. ఇట్లు కొంతసేపు నూలును గుఱించియు నూలొడుకువారి గుఱించియు స్తోత్రపాఠములు పఠించి యా గ్రామాధికారు లరుగునప్పుడు రాముఁడు వారికి నిట్లనియె.

పురుషశ్రేష్ఠులారా! మీ రాజుగారితో రెండు మూఁడు దినములలో నూలు తీయుట పూర్తియగునని చెప్పుడు. దాని మార్దవాదిగుణంబులు మీరు చూచినదేకదా? అదియుఁగూడఁ దేటపరుపుఁడని మిగుల గౌరవముగా వారిని సాగనంపి వరప్రసాదులు వారి మూఢత్వమునకై యొండొరులు నవ్వుకొనుచు నారాట్టంబులు