పుట:కాశీమజిలీకథలు-12.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

బ్రహ్మ - సరి సరి. నేను రిపుంజయుని నైజంబెరుంగనా ? దయావినయ సత్యశౌచశీలాది యుత్కృష గుణగణవిరాజితుండగు నాతఁడే సర్వవిధముల సర్వం సహాభారధూర్వహుఁడు.

నార - అట్లయిన మీకు తోచినట్లు చేయుఁడని పలికి బ్రహ్మ యను మతంబు వడిసి యిచ్ఛాగ తిం బోయెను.

పిమ్మట రిపుంజయునిఁబుడమికి రాజుగా జేయ నిశ్చయించి విరించిమించిన యాత్రముతో వాని సన్నిధికఱిగి యతనితోఁ దన యభిప్రాయము నెరింగించి యందులకు సమ్మతింపుమని కోరెను. రిపుంజయుండును నిటలతటఘటితకరపుటుండై మృదుమధురగంభీర వాక్కుల నక్కమలాసనునితో నిట్లనియెను.

దేవా ! దేవరయానతి మహాప్రసాదంబని శిరసావహింతునుగాని యన్యధా తలంతునా ? సిరిరా మోకాలొడ్డు వాఁడెందైనంగలడా ? కాని యొకటి కోరుచున్నాను.


చ. వసుమతినే భరించి పరిపాలనమున్‌ బొనరించువేళ న
    ప్పసము మదాజ్ఞ వేదపరిపాటి జగంబు దలంపఁగావలెన్‌
    అసమమదీయ విక్రమవిహారమునంచేదు రెందులేక న
    ల్దెసలయశఃప్రభల్‌ బరగదేకులనేఁ జరింపఁగావలెన్‌.

మరియును నరసుర గరుడ గంధర్వ కిన్నరకింపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్యవిద్యాధరాదులయొక్క. బలప్రతాపసామర్థ్యంబులు నాయందిమిడి యుండవలెను. నా యభిమతంబునకు దేవత లెవ్వరును గూడ మారాడరాదు ఇట్టి వరంబులు నాకు దయ చేసితివేని నీ యానతిఁ బుడమియొడయఁడనై యుండెదను. అని పలికిన వాని మాటలు కాకలుములజవరాలి తొలిపట్టి యనుమతించి మించిన సంతసంబున నిట్లనియె.

రిపుంజయా ! నీవు కోరిన వరంబులన్నియు నొసంగితి. చతురంభోధి పరీత వసుమతీ చక్రంబెల్ల నీ కనుసన్నల మెలంగఁగలదు. దివిజులకు హితంబగునట్లు నీవిఁక పుడమిం బరిపాలింపుము. దివిజహితంకరుండవగు నీకిటమీద దివోదాస సమాఖ్య యొప్పియుండును. అని వచించు నవ్విరించి కతండిట్లనియె దేవోత్తమా ! మరియొక మాటగూడ గలదు. వినుఁడు --


చ. సురలదిగాదొ నాకము ? వసుంధరనుండఁ బనేమివారికి క
    య్యురగులకై యథోభువనముండఁగ వారును భూవిహారమున్‌
    జరుపఁగనేల ? నాకటుల సమ్మతిగాదిఁక వారువారు స
    త్వరమధరాతలంబు విడువన్‌ వలయున్‌ జుమనాదు యేల్బడిన్‌.

ఇందులకుఁగూడ నీవంగీకరింతువేని నేనీధరాభారంబు వహింపఁ బూనెదను.