పుట:కాశీమజిలీకథలు-12.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమావతి కథ

45

మాటలుడిగి యీపాటి కీవలకు రమ్ము నన్నందుఁబోనిమ్ము. ఇందు వేరొక వైఖరి నీవు ప్రవర్తించిన మన నేస్తములు నిలువనేరవు. సత్వరమ రమ్మని పిలుచుచుండ మణిగ్రీవుండు కటకటంబడుచు నిట్లనియె

జలంధరా ! నీయవాచ్యములకు మేరలేకున్నది. మన నేస్తము. లిఁకమీద నిలువ నేరవనియా యంటివి తధాస్తు. ఈ క్షణము మొదలు మనకొకరితో నొకరికి సంబంధము లేదు. ఇంక నధిక ప్రసంగము జేయక యవులంబొమ్ము. ఈ ముద్దు మోముం జూడ నేవగించుకొనుచున్నది. ఆ పలుకులు విని జలంధరుండు నాది మొద్దు మొగమును నీది రాకాచంద్రబింబమునా ? నీ యందమునకు నీవ విఱ్ర వీగవలెను. ఆ యెలనాగ నందు విడిచి నీ విందుండి నిమిషములో లేచిపోవలెను. లేకున్న యవులకీడ్పించెదను. అని యనుటతోడనే మణిగ్రీవుండు మండిపడుచుఁ దటాలునఁ దలుపు తీసికొని యీవలకు వచ్చి జలంధరుని జుట్టుపట్టి వంచి వీపుమీద రెండు గ్రుద్దులు వేసెను. జలంధరుఁడు వానిపై దిరుగఁబడి పాదప్రహరణంబులఁ బ్రత్యుత్తరమిచ్చెను. ఆ యదనున ననంగ మోహిని తన్మందిర కవాటము లోన బిగించుకొనియెను.

ఇట్లా పురుషులిర్వురు దమ పూర్వపుమైత్రిందలపకయన్యోన్య విజిగీషేచ్చా మనీషులై ముష్టియుద్ధం బొనరించుచుండ హేమావతి చర చర నచ్చటికివచ్చి వారిని గారులుచ్చరించుచు మ్రుచ్చులారా ! మీ మూలమున నాకుఁగూడ నవమానము రాఁగలదు. మీపోరు విధం బెవ్వరేని విన్న నాగుట్టు దేవేంద్రునికిగూడఁ దెలియగలదు. ఇఁక మీ నీగసహవాసము నాకు చాలును తక్షణమ నాగృహమునుండి యవులంబొండు. లేకున్న బలవంతముగ గెంటింపవలసివచ్చును. మఱియొక యుచితస్థలంబునకుఁ బోయిన నొకరిబలము లొకరు తెలిసికొనవచ్చును. అని పలుకుచుండగనే మణి గ్రీవుండు జలంధరుని నాంత్రములూడునట్లు గట్టిగాకొట్టెను. వాఁడాదెబ్బకోర్వఁజాలక బైటకుఁ బారిపోయెను. వానిం దరుముకొని మణిగ్రీవుం డేగెను. హేమావతి వారు తిరిగి రాకుండునట్లు కట్టుదిట్టములు జేసెను.


310 వ మజిలీ

అనంగమోహినికథ

మణిగ్రీవజలంధరు లరిగిన యనంతరంబున హేమావతి యనంగమోహిని యున్న గదియొద్దకువచ్చి అమ్మా! ఆ మ్రుక్కడు లిక్కడలేరు. తలుపుదీయుము వారిమైత్రి నేటితో తీరినది. స్త్రీ మూలకమగు విరోధము మాటలతోఁ దీరునదికాదు,