పుట:కాశీమజిలీకథలు-12.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హేమావతి కథ

43

బునఁ దమకుఁ బ్రధమ సమావేశ మగుటచే నా ప్రాంతములయందు వారి కెక్కు డభి మానము గలదు. అక్కారణమున వారు హేమావతితో నందు విహరించుట కెప్పు డును ముచ్చట పడుచుందురు. ఇట్లు కొంతకాల మరిగిన పిమ్మట నింద్రాదుల నారాయ ణుని యనుగ్రహమునఁ జగతుర నిర్జించియమరావతిని నిష్కంటకంబుగఁ బరిపాలించు చుండుట యెరింగి హేమావతి తన నిలయంబున కరిగినది. మణిగ్రీవ జలంధరులు, నిత్యమును స్వర్గపురంబునకుఁ బ్రచ్చన్నముగఁ బోయి హేమావతీ నిలయంబున నామెతోఁ గ్రీడావినోదంబులఁ గొంత తడవుండి తిరిగి వచ్చుచుందురు. వారు విమాన మెక్కి యప్పుడప్పుడు విలాసముగా నందందు విహరించుటకూడఁగలదు.

ఇట్లు పెద్దకాలము గతించిన పిమ్మట నొకనాఁడు వ్యోమయానంబున నొక సీమంతినీ రత్నమునుదెచ్చి మణిగ్రీవజలంధరులు హేమావతీ సౌధాభ్యంతరమంది రంబునఁ బెట్టిరి. ఇట్లొనర్చుట హేమావతికి మనంబున నిష్టము లేకున్నను నా మిత్రుల ప్రోద్బలంబు కతంబున మిన్నకున్నది. పిమ్మట మణిగ్రీవుండు మెల్లగా నయ్యబల సన్నిధింజేరి మోహావేశంబున నిట్లనియె.

నా శిరోమణీ ! త్రిలోక మోహజనకంబైన నీ సౌందర్యంబు గన్నులార గాంచి క్రొన్నన విలుకాని యడిదంపు పోటులసహింపఁజాలక నేనీ సాహసమునకుం బూనుకుంటిని. ఇందులకు నన్ను న్యధా తలంపక కటాక్షరసప్రసారంబున నన్నాదరించి యేలుకొనుము. నీ కనుసన్నల మెలంగఁ గలవాఁడను నేను మణిగ్రీవుండను. యక్ష కుమారుండను. కుబేరుని సంతతివాడను. సర్వభోగభాగ్య సంపన్నుఁడను. నన్ను జేపట్టిన నీవు మితిలేనిసుఖంబులఁ బొందఁగలవు. ఇందులకు నీవు సమ్మతించి భవదీయ సుధమధురాధర రసంబిచ్చి నన్నుఁ గృతార్థుం జేయుము. అని యింక నేమేమో మదనోన్మాదుండై వచించుచున్న వానికా యోషిల్లలామ శోకావమానజనిత క్రోధానల తీవ్రంబున ననేక నిష్టురములాడుచు మరియు నిట్లనియె.

ఓరీ ! బాలిశా ? నీ తులువతనంబెల్ల నీ చేష్టలవలననే తెల్లమగుచుండెను. నీవు దేవయోని సంభూతుండవైనను కుచ్చితకార్యాచరణంబునకు వెనుదీయని వాఁడవై నికృష్టుండవైతివి. పరనారీ సమాపహరణ మహాపాతంబునకుఁ గడఁగిన నీవు క్రూరరాక్ష సాధముండవు. నిన్నుజూచి నీతో సంభాషించినవారికిఁ గూడ నీ కిల్మిషము‌ లంటఁ గలవు. పో. పొమ్ము. అని కఠినముగాఁ బలుకుచున్న యామె పలుకులు ములుకులై మర్మచ్చేదం బొనర్ప నరడాగ్రహంబున నిట్లనియె.

ఏమేమీ ! నీ విందు నాకు ధర్మోపన్యాసము నొనరించుచుంటివా దేశకాల పాత్రంబులెరింగి మాటలాడకున్న యవమానమురాఁగలదు. నీవు నాయధీనమైతివి. వంటయింటకుందేలెందుఁ బోఁగలదు. మచ్చిక నే జెప్పుమాటల కిచ్చగించిన మేలయ్యె డిని. లేకున్న నిన్నిందు బలాత్కరించి నా యభీష్టము దీర్చుకొందును. నన్నునీ విందంగీకరించినచో ననన్యసామాన్య దివ్యభోగంబుల సుఖింపఁగలవు. లేకున్న